వివేక్ అనర్హుడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక చెల్లదంటూ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ఉత్తర్వులు జారీచేయడం సంచలనం సృష్టించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేక్ ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్ స్థాయి పదవి అయిన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదని ఆయన పేర్కొన్నారు.
కాగా, హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ ఎన్నిక కూడా చెల్లదని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏసీబీ చార్జిషీటులో శేష్‌నారాయణ్ నిందితునిగా ఉన్నందున కార్యదర్శి పదవికి ఆయన అర్హుడు కాదని అంబుడ్స్‌మన్ తేల్చారు. వారిని పదవుల నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శుల కోసం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంతవరకు హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులుగా ఉపాధ్యక్షుడు, కోశాధికారి వ్యవహరిస్తారని చెప్పారు.