మీ పెట్టుబడులకు మార్గం సుగమం
జపాన్ రాయబారితో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జపాన్ పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. జపాన్‌లో ఇప్పటికే ఇన్వెస్టిమెంట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భారత్‌లో జపాన్ రాయబారి తకేషీ శుక్రవారం సీఎంను సచివాలయంలో కలుసుకున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షను ఆయన ఈ సందర్భంగా బాబు ముందుంచారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, ఆగ్రో ప్రాసెసింగ్, అక్వా కల్చర్, పెట్రో కెమికల్స్, ఆటోమొబైల్, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ను కోరారు. జపనీస్ భాష తెలిసిన అధికారిని కూడా నియమిస్తామని చెప్పారు.
ఆరుగురితో కమిటీ: జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ప్లానింగ్) టక్కర్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌తో పాటు, మరో ముగ్గురు జపనీస్ అధికారులకు ఈ కమిటీలో చోటు కల్పించారు.
రూ.71 లక్షల చెక్కును అందజేసిన సినీనటులు
హుద్‌హుద్ తుపాను సహాయార్థం విజయవాడలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా సమకూరిన రూ.71 లక్షల మొత్తాన్ని సినీహీరోలు శుక్రవారం రాత్రి శ్రీకాంత్, తరుణ్ తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కు రూపంలో అందజేశారు.
ఏప్రిల్ 1 నాటికి 4 జీ సేవలు: సీఎం
స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వీలుగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 4 జీ సేవలను ప్రాథమికంగా అందించాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసిన రిలయన్స్ సంస్థ ప్రతినిధులు రఘురాజు, రాజీవ్ లుత్రా.. 4 జీ సేవలపై చర్చించారు. రాష్ట్రంలో 502 రిలయన్స్ టవర్లున్నాయని, వాటిని 4 జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు అనుమతులు కావాలని కోరారు. దీంతో చంద్రబాబు పై ఆదేశాలు ఇచ్చారు. రక్షణ, నేర నియంత్రణ తదితర అంశాల్లో ఈ సేవలు వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాలని సమావేశంలో పాల్గొన్న డీజీపీ జె.వి.రాముడును ఆదేశించారు.