సీఎంకు తుగ్లక్ కాలం నాటి నాణెం బహూకరణ
సాక్షి, హైదరాబాద్: గియాజుద్దీన్ తుగ్లక్ కాలం నాటి అరుదైన బంగారు నాణేన్ని టీఆర్ఎస్ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బహూకరించారు. శనివారం అసెంబ్లీలో సీఎంను కలసిన ఆయన తెలంగాణను సాధించి నందుకుగాను ఈ నాణెం బహూకరించినట్లు తెలిపారు.
దేవేందర్‌కు పురాతన నాణేలు, వస్తువులు సేకరించే అలవాటు ఉంది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఆక్రమించిన గియాజుద్దీన్ తుగ్లక్ కొడుకు అప్పటి యువరాజు మహ్మద్ బీన్ తుగ్లక్ ఆధ్వర్యంలో వరంగల్‌లో మల్కీ తిలాంగ్ మింట్ ఏర్పాటైంది. సీఎంకు అందించిన నాణెం ఇందులో తయారైనదే. దానిపై మల్కీ తిలాంగ్ మింట్ (లాండ్ ఆఫ్ తెలుగు) అని ముద్రితమై ఉంది. అరుదైన నాణేన్ని బహూకరించినందుకు ఆయనకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేకరించిన ఇతర నాణేల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, తెలంగాణ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.