Tanishq Abraham
-
15 ఏళ్లకే ఇంజినీర్ అయ్యాడు!
వాషింగ్టన్ : ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు తనిష్క్ అబ్రహం.. చిన్నవయస్సులోనే అపారమైన మేధస్సుతో అబ్బురపరుస్తున్న ఈ బాలమేధావి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లకే ఇంజినీర్‌గా పట్టభద్రుడు అయ్యాడు. యూసీ డేవిస్ విద్యాసంస్థ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయస్సులోనే చదువులో అసాధారణ ప్రతిభ చాటుతూ.. మూడేళ్ల కిందటే మూడు డిగ్రీలు పొందాడు. ఇప్పుడు తాజాగా బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన తనిష్క పీహెచ్డీ చేసి.. డాక్టరేట్ పట్టా పొందాలని భావిస్తున్నాడు. 15వ ఏట అడుగుపెట్టడానికి కొన్నిరోజుల ముందే ఫాదర్స్ డే సందర్భంగా తనిష్క్ ఈ డిగ్రీ పట్టా పొందాడు. అక్కడితో అతను ఆగిపోలేదు. వెంటనే యూసీ డేవిస్ మెడికల్ సెంటర్లో తన సీనియర్ డిజైన్ ప్రాజెక్టును సమర్పించాడు. అనంతరం సదరన్ కాలిఫోర్నియాలో జరిగిన బయోమెడికల్ ఇంజినీరింగ్ సదస్సులో పాల్గొని.. తన పరిశోధన ప్రాజెక్టు డిజైన్‌ను సమర్పించాడు. అంతేకాకుండా యూసీడీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అకాడెమీలో నిర్వహించిన 3రోజుల క్రాష్కోర్సులోనూ అతను చేరాడు. బాలమేధావి తనిష్క్ అబ్రహంకు సంబంధించి మరిన్ని కథనాలు.. అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి ఈ బుడ్డోడు సూపర్ ఫాస్ట్! 10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి! -
అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి
లాస్ఏంజిల్స్: డాక్టర్ కావాలన్నదే తన ఆశయమని అతి పిన్న వయసులో డిగ్రీ పట్టా పొంది చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన అమెరికా బాల మేధావి తనిష్క్ అబ్రహం చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ప్రశంశలందుకున్న ఈ పన్నెండేళ్ల చిన్నారి తనకు 18 ఏళ్లు వచ్చేసరి ఈ లక్ష్యాన్ని చేరుకొంటానంటున్నాడు. కాలిఫోర్నియాలోని సక్రమెంటోలో నివసించే తనిష్క్‌కు రెండు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి ఆహ్వానం అందింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీ) డేవిస్, యూసీ శాంతాక్రజ్లు తమ క్యాంపస్‌ల్లో చేరాలంటూ కోరాయి. అయితే ఎందులో చేరాలన్నది తనిష్క్ ఇంకా నిర్ణయించుకోలేదు. ‘బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివి 18 ఏళ్లు వచ్చేసరికి ఎండీ పట్టా అందుకోవాలనుకుంటున్నా. నేనూ అందరిలా వీడియో గేమ్‌లు ఆడుకొంటూ ఆస్వాదించే సాధారణమైన పిల్లాడినే. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తా’ అంటున్న తనిష్క్... గత ఏడాది కాలిఫోర్నియాలోని ఓ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందాడు. అదే సమయంలో అమెరికన్ రివర్ కాలేజీ నుంచీ పట్టభద్రుడయ్యి రికార్డు సృష్టించాడు. అమెరికా అధ్యక్షుడవ్వాలని కోరుకొంటున్నట్టు చిన్నారి వెల్లడించాడు. తనిష్క్ తండ్రి బిజో అబ్రహం సాఫ్ట్వేర్ ఇంజినీర్. తల్లి తజి వెటర్నరీ వైద్యురాలు. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. -
ఈ బుడ్డోడు సూపర్ ఫాస్ట్!
సాక్రమెంటో: ఈ బుడ్డోడికి నిండా పన్నెండేళ్లు కూడా లేవు. కానీ ఇప్పటికే ముడు డిగ్రీలు పూర్తిచేసి పట్టా పుచ్చుకున్నాడు. మరో రెండు యూనివర్సిటీలు పిలిచి మరీ పీజీ సీటు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. చిన్న వయస్సులోనే చదువులో పెద్ద ప్రతిభ చూపుతున్న ఆ చిన్నారే.. 12 ఏళ్ల తనిష్క్ అబ్రహం. అమెరికాలోని సాక్రమెంటోకు చెందిన ఈ చిన్నారికి యూసీ డేవిస్ యూనివర్సిటీ, యూసీ శాంటాక్రూజ్ వర్సిటీల్లో సీటు వచ్చింది. వీటిలో ఏ వర్సిటీలో చేరాలో అబ్రహం ఇంకా నిర్ణయించుకోలేదు. బయో మెడికల్ ఇంజినీరింగ్ చదవాలని భావిస్తున్న అబ్రహం తనకు 18 ఏళ్లు వచ్చేసరికి ఎండీ పూర్తి చేసి డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చదువులో సూపర్ ఫాస్ట్‌గా ఉన్న అబ్రహంకు 18 ఏళ్లు వచ్చేసరికి డాక్టర్‌గా, వైద్య పరిశోధకుడిగా పట్టాలు సాధించే అవకాశముంది. అబ్రహం గురించి తాజాగా సాక్రమెంటో టెలివిజన్ స్టేషన్ 'సీబీఎస్ 13' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అబ్రహం 7 ఏళ్ల వయస్సులోనే కమ్యూనిటీ కాలేజీలో చేరాడు. సాక్రమెంటోలోని అమెరికన్ రివర్ కాలేజీలో జరనల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, విదేశీ భాష సబ్జెక్టులుగా కాలేజీ చదువు పూర్తి చేశాడు. తరగతి గదిలో జటిలమైన సబ్జెక్ట్ పాఠాలు అబ్రహంకు చెప్పడానికి తాము మొదట భయపడ్డామని, కానీ, అతడు పాఠాలు శ్రద్ధగా వింటూ, మధ్యమధ్యలో ప్రశ్నలు అడుగుతూ సందేహాలు నివృత్తి చేసుకునేవాడని వారు అంటున్నారు. అబ్రహం తమను ప్రశ్నలు అడుగడంలో ఎప్పుడూ భయపడలేదని బయాలజీ ప్రొఫెసర్ మర్లెన్ మార్టినెజ్ చెప్పారు. తనిష్క్ తల్లి వెటినరీ డాక్టర్. ఆమె మొదట్లో కొన్నిరోజులపాటు కొడుకుతో కలిసి తరగతి గదులకు హాజరయ్యేది. నాలుగేళ్ల వయస్సులోనే ఐక్యూ సొసైటీలో చేరిన తనిష్క జ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకునేవాడని, వాడి స్పీడ్‌ను చూసి భవిష్యత్తులో పిచ్చి శాస్త్రవేత్త అవుతాడేమోనని ఒకానొక దశలో తాము భయపడ్డామని తండ్రి బిజౌ అబ్రహం చెప్పాడు. -
అమెరికా అధ్యక్షుడినవుతా
లాస్ ఏంజెల్స్: భారతీయ సంతతికి చెందిన అమెరికా బాలుడు 11 ఏళ్లకే డిగ్రీ పట్టా పుచ్చుకుని పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రివర్ కాలేజీలో మూడు వరుస డిగ్రీలతో సంలచనం సృష్టించాడు. అమెరికాలో అతి చిన్న వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థిగా తనిష్క్ అబ్రహాం రికార్డు కొట్టేశాడు. ఏకంగా మూడు విభాగాల్లో.. మాథ్స్, సైన్స్, విదేశీ భాషల్లో డిగ్రీలు సాధించాడు. 1800 విద్యార్థుల్లో హాజరైన ఈ సంవత్సరం పరీక్షల్లో తనిష్క్ ఈ ఘనతను సాధించాడు. తనిష్క్ ఏడేళ్ల వయిసులో హైస్కూలు డిప్లొమా సాధించి అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రశంసలందుకున్నాడు. తనిష్క్‌ను అభినందిస్తూ ఆయన ఒక లేఖ కూడా రాశారు. తనిష్క్ చాలా తెలివైనవాడు... క్లాస్‌లో ఎప్పుడూ తనే ఫస్ట్...ఇది ఏమంత పెద్ద విజయం కాదు..తను సాధించాల్సింది ఇంకా ఉంది అంటున్నారు తల్లి తాజి అబ్రహాం. అన్నట్టు ఈ బుడతడు డాక్టర్ కావాలనుకుంటున్నాడట... వైద్యరంగంలో పరిశోధనలు చేయాలనుకుంటున్నాడట.. అంతేనా.. అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడట. నాకు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ అలవాటే నన్ను ఇక్కడ నిలబెట్టిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు తనిష్క్. దీంతో.. హార్నీ.. పిడుగా. ఏకంగా ఒబామాకే ఎసరు పెట్టేశాడుగా అని చమత్కరిస్తున్నారు కొంతమంది పెద్దలు! -
10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి!
లాస్ ఏంజెలిస్: అమెరికాలో భారత సంతతికి చెందిన బాలమేధావి తనిష్క్ అబ్రహాం పదేళ్లకే అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో అతిపిన్న వయసులో హైస్కూలు విద్యను పూర్తిచేసిన విద్యార్థుల్లో ఒకడిగా రికార్డు సష్టించాడు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన అబ్రహాం ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హైస్కూలు డిప్లొమాను అందుకున్నాడు. ఏడేళ్ల వయసు నుంచీ ఇంటిదగ్గరే చదువుకుంటూ అతడు ఈ ఘనతను సాధించడం విశేషం. త్వరలో కమ్యూనిటీ కాలేజీలో చివరి సెమిష్టర్నూ పూర్తిచేయనున్న అబ్రహాం అసోసియేట్ డిగ్రీని పొందనున్నాడు. తర్వాత యూనివర్సిటీలో చదువుకోనున్నాడు. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా లేదా వైద్యుడిగా పేరుతెచ్చుకోవాలని, అలాగే అమెరికా అధ్యక్షుడు కూడా కావాలనుందని ఈ బుడతడు చెబుతున్నాడు.