భయంతో పరిగెత్తాను
* ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.. నీడలా వెంటాడుతోంది..
* చూస్తే గుర్తు పడతా.. చుట్టుపక్కలవారు ఆపద్భాందవుల్లా వచ్చారు
* రావెల సుశీల్ వేధింపులకు గురైన టీచర్ ఫాతిమాబేగం
హైదరాబాద్: ‘‘నా వెనుక నుంచి తెల్లరంగు ఖరీదైన కారు రావడాన్ని గమనించాను. మామూలుగా పక్క నుంచి వెళ్తుంది కదా అని నా దారిన నేను ముందుకు వెళ్తున్నాను. అయితే కారు వచ్చి నా పక్కన ఆగడమే కాకుండా అది నడుపుతున్న యువకుడు కారులో కూర్చో అంటూ పిలిచేసరికి భయపడ్డా. అలాగే ముందుకు వెళ్తుండగా కారు స్పీడ్‌గా పోనిచ్చిన యువకుడు కొద్ది దూరం నుంచి టర్న్ తీసుకొని మళ్లీ నా ముందుకు వచ్చి నిలిపాడు.
మద్యం మత్తులో ఉన్న అతడు కారులోంచి కిందికి దిగి వెనుక డోరు తెరిచి నా చేయి పట్టుకుని లోనికి లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో అరుస్తూ ప్రతిఘటించాను. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాను’’... ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు రావెల సుశీల్ వేధింపులకు పాల్పడిన ప్రైవేట్ స్కూల్ టీచర్ ఫాతిమాబేగం పోలీసులకు ఇచ్చిన వివరణ ఇది. శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో పాటు ఏసీపీ, సీఐని కలసిన బాధితురాలు.. తన చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ వారిని నిలదీసింది.
అనంతరం ఆమె మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ అయిపోయాక తన ఇద్దరు కుమారులను భర్త సయ్యద్ ఆజం స్కూటర్‌పై ఇంటి వద్ద దింపి వచ్చి తనను తీసుకెళతానని చెప్పడంతో నడుచుకుంటూ వస్తున్నానని తెలిపింది. అదే సమయంలో తెల్లరంగు కారులో వచ్చిన నలుపు టీషర్ట్ ధరించి చేతిపై టాటూ వేయించుకున్న యువకుడు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. గడ్డంతో ఉన్న అతడిని చూస్తే గుర్తుపడతానని పేర్కొంది.
పీకలదాకా మద్యం సేవించి ఉన్న ఆ యువకుడితో పాటు పక్కనే ఉన్న వ్యక్తి కూడా తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో భయం వేసిందని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే చుట్టుపక్కల వారు ఆపద్భాందవుల్లా వచ్చారని తెలిపింది. కొద్దిసేపట్లోనే తన భర్త కూడా రావడంతో బతికి బయటపడ్డానని వెల్లడించింది. వెలుతురు ఉన్న సమయంలో కాబట్టి బయటపడ్డానని చీకటిపడితే తన పరిస్థితి ఆ కీచకుల చేతుల్లో ఎలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేసింది.
తాను రావెల సుశీల్‌ను స్పష్టంగా చూశానని, ఆ కారును కూడా గుర్తుపట్టానని పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్నదే తన ఉద్దేశమని, అందుకే పోరాటం చేస్తున్నానని తెలిపింది. నిందితుడిని అరెస్టు చేసేదాకా ఊరుకోనని హెచ్చరించింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుందని చెప్పింది. ఇప్పటికీ రావెల సుశీల్ తనపట్ల ప్రవర్తించిన తీరు నీడలా వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.