స్కూల్లో పిల్లాడు.. తాళం వేసుకు వెళ్లిపోయిన టీచర్లు
తరగతి గదిలో చిన్న పిల్లాడు ఉన్నా కూడా చూడకుండా పాఠశాలకు తాళం వేసుకు వెళ్లిపోయారు ఉపాధ్యాయులు. నిర్లక్ష్యానికి నిలువుటద్దం లాంటి ఈ సంఘటన కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలో జరిగింది. సొర్లగొంది గ్రామంలో నరసింహస్వామి అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 4 గంటలకే స్కూలు అయిపోయినా.. ఆరు గంటల వరకు కూడా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గాభరాపడ్డారు.
ఊరంతా వెతుక్కుంటూ వెళ్లి, ఎందుకైనా మంచిదని పాఠశాలకు వెళ్లి చూడగా, తరగతి గదిలో నేలపై పడుకుని నిద్రపోతున్న స్వామి కనిపించాడు. అప్పటికే బాగా ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినట్లు గుర్తించారు. తలుపు తాళం వేసి ఉండటంతో తాళం పగలగొట్టి, పిల్లాడిని బయటకు తీసుకొచ్చారు. ఒకటో తరగతి పిల్లాడు లోపలున్నా చూడకుండా తాళం వేసుకుని వెళ్లిపోయిన ఉపాధ్యాయులను ఏమనాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.