‘అభివృద్ధికి అడ్డుగా ప్రధాని మోడీ, చంద్రబాబు’
తూప్రాన్: తెలంగాణ లో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం తూప్రాన్ మండలంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో నేడు విద్యుత్‌కు అనేక ఇబ్బందులు ఎదురవడానికి కారణం ఖమ్మంలోని దిగువ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని సీమాంధ్రలో విలీనం చేయడమేనన్నారు. విలీనం వల్ల 400 మెగావాట్ల విద్యుత్ ఆంధ్రకు వెళ్లిపోయిందన్నారు. కడప నుంచి తెలంగాణకు రావాల్సిన 600 మెగావాట్ల విద్యుత్‌ను చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇదంతా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, చంద్రబాబు కుట్ర రాజకీయాలతో తెలంగాణకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే.. నాడు రాజీనామ చేయని మీరు కేసీఆర్‌పై విమర్శలు చేస్తారా? కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదని’ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేతనైతే కరెంటు కోసం ఢిల్లీలోని ప్రధానమంత్రిని నిలదీయాలని కిషన్‌రెడ్డికి సూచించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల్లోనూ ప్రధానమంత్రి తెలంగాణపై వివక్ష చూపుతున్నారని వాపోయారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రకు బుల్లెట్ రైలు, తెలంగాణకు మోండిచేయి చూపారని హరీష్‌రావు ఆరోపించారు. తమ ప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అవినీతి రహిత పాలన అందించాడానికి, బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అయితే ప్రధానమంత్రి కుట్రలో భాగంగానే రిజర్వు బ్యాంకు మెలికలు పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.
భారీగా చేరికలు..
తూప్రాన్ మండలంలోని మనోహరాబాద్ టీడీపీకి చెందిన సర్పంచ్ సంతోష, సోముల్యాదవ్, మాజీ ఎంపీపీ మేకల అర్జున్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు ఆంజనేయులు, రజనీ, బాపు, మాజీ ఉప సర్పంచ్ అంజాగౌడ్, మాల్కాపూర్ సర్పంచ్ స్వామి, రంగాయిపల్లి మాజీ సర్పంచ్ నాగభూషణం, టీఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు బద్రితో పాటు సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.