తెలంగాణ ఆర్థిక మూలాలపై జీఎస్టీ దెబ్బ.. ఖజానా ఖల్లాస!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మూలాలపై దెబ్బపడబోతోందా..? రాష్ట్ర ఖజానాకు కాసుల గలగలలు దూరం కాబోతున్నాయా? పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి భారీ గండి తప్పదా..? కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వస్తు సేవల పన్ను(జీఎస్టీ)తో భవిష్యత్తులో అదే జరుగుతుందంటున్నారు విశ్లేషకులు! రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనకు ప్రధానమైన పన్నుల విధానం మరో ఏడాదిలో కేంద్రం చేతుల్లోకి వెళ్లబోతోంది. ఏకీకృత పన్నుల విధానం పేరుతో కేంద్రం తీసుకురాబోతున్న జీఎస్టీ దెబ్బకు తెలంగాణ పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోనుంది. రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూస్తామని కేంద్రం చెబుతున్నా... చివరికి ఆ హామీలేవీ నిలబడే అవకాశాలు లేవని గత అనుభవాలు చెబుతున్నాయి. ఏతావాతా జీఎస్టీతో పన్నుల పెత్తనం అంతా కేంద్రం చేతిలోకి వెళ్లడం.. కేంద్రం ముందు రాష్ట్రాలు చేతులు చాచే పరిస్థితి రావడం తప్పేలా కనిపించడం లేదు. కొత్త రాష్ట్రంగా అవతరించి, కోటి ఆశలతో అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కారు.. వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ విధానం రాష్ట్ర ఆదాయానికి గండి కొడితే దాని ప్రభావం ఈ పనులపై పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నష్టాలు భరిస్తామని చెబుతున్నా...
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జీఎస్టీ విధానాన్ని 2016, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చేందుకు కేంద్రం వేగంగా కదులుతోంది. ఈ బిల్లును శుక్రవారమే పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టింది. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని తొలి మూడేళ్లలో వందశాతం భరిస్తామని, నాలుగు, ఐదు సంవత్సరాల్లో వరుసగా 75 శాతం, 50 శాతం భరిస్తామని బిల్లు ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంటే ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రాలు నష్టపోతాయనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టు స్పష్టమైంది. ఐదు సంవత్సరాలు దాటినా నష్టమని భావిస్తే రెండేళ్లపాటు జీఎస్టీ మీద అదనంగా ఒక శాతం పన్ను విధించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇవన్నీ భవిష్యత్తులో రాష్ట్రాల ఖజానాకు గండి తప్పదనే సంకేతాలు పంపుతున్నాయి.
కేంద్రంపై ఆధారపడే పరిస్థితికి: ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 బడ్జెట్ దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలపైనే! ఇందులో వాణిజ్య పన్నుల శాఖ నుంచి వచ్చిన రెవెన్యూ ఆదాయం ఏకంగా రూ.50,542 కోట్లు. అంటే మూడో వంతు రాబడి ఈ శాఖ నుంచే వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2014-15 సంవత్సరానికి వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం ఈ శాఖ నుంచే రానుంది. కానీ జీఎస్టీ అమలైతే ప్రత్యక్షంగా వాణిజ్య పన్నుల శాఖకు ఇందులో మూడో వంతు కూడా రాదని అంటున్నారు. కేంద్రం ఇచ్చే వాటా ప్రకారం వసూలైన పన్ను నుంచి కొంత మేర రాష్ట్రానికి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్రం వసూలు చేస్తున్న వ్యాట్, సీఎస్టీ, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, వాహన ప్రవేశ పన్ను, కొనుగోలు పన్ను, గుర్రపు పందేలు, బెట్టింగ్ పన్నులన్నీ కేంద్రం పరిధిలోకి వెళతాయి. జీఎస్టీ ద్వారా పన్నులు విధించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చినా... పెత్తనం మాత్రం కేంద్రం చేతిలోనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు ఎవరికి వారు వస్తువులపై, సేవలపై పన్నులు వేస్తున్నాయని, జీఎస్టీ అమలులోకి వస్తే పన్నుల మీద పన్ను ఉండదని కేంద్రం చెబుతోంది. తద్వారా రాష్ట్రం నష్టపోయే విలువకు సమానంగా నష్టపరిహారం ఇస్తామని కేంద్రం చెప్పే మాటలు మున్ముందు అమలయ్యే అవకాశం లేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన 2005లో కూడా కూడా కేంద్రం ఇలాగే చెప్పింది. రాష్ట్రాలు నష్టపోయే వాటాను తామే చెల్లిస్తామని చెప్పినా.. ఆ తర్వాత పట్టించుకోలేదు. అలా ఇప్పటికి కేంద్రం నుంచి వ్యాట్ వాటా కింద తెలంగాణకు రూ.5,000 కోట్లు రావలసి ఉండడం గమనార్హం.
తెలంగాణ వాదన పట్టించుకోని కేంద్రం
రాష్ట్రాల రెవెన్యూ హక్కులకు భంగం కలగకుండా జీఎస్టీ అమల్లోకి తెస్తే తమకేం అభ్యంతరం లేదని తెలంగాణ ఇప్పటికే రెండుసార్లు కేంద్రానికి స్పష్టం చేసింది. అదే సమయంలో మద్యం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు వేసే హక్కును రాష్ట్రాలకే ఇవ్వాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రానికి విన్నవించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ... మద్యంపై పన్ను హక్కులను రాష్ట్రానికే ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే పెట్రోలు, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మెలిక పెట్టారు. వాటిని జీఎస్టీలో పొందుపరిచే తేదీని జీఎస్టీ మండలికి వదిలేసింది. ఈ మండలిలో మూడింట రెండొంతుల మంది సభ్యులు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నా.. బీజేపీ పాలిత రాష్ట్రాల నిర్ణయం కేంద్రానికే అనుకూలంగా ఉండనుంది.
42 శాతం రెవెన్యూ మూడింటి నుంచే
తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ 2014-15లో రూ.30 వేల కోట్ల రెవెన్యూ అంచనా వేశారు. అందులో మద్యం, పెట్రోలు ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై వేసే పన్నుల ద్వారా 42 శాతం రెవెన్యూ వస్తుందని అంచనా. తెలంగాణలో మద ్యంపై విధించే పన్ను(వ్యాట్) 70 శాతం నుంచి 160 శాతం వరకు ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల మీద 14.5 శాతం నుంచి 23.5 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ఇక పొగాకు ఉత్పత్తుల మీద 20 శాతం పన్ను ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో లెక్కలేస్తే రాష్ట్రానికి ఈ మూడింటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం రానుంది. తెలంగాణ విడిపోయాక జూన్ నుంచి నవంబర్ వరకు వాణిజ్య పన్నుల శాఖకు రూ.14,008 కోట్ల ఆదాయం వస్తే అందులో మద్యం ద్వారా రూ. 3,359, పెట్రోలియం ఉత్పత్తుల మీద రూ.3,233 కోట్లు ఆదాయం సమకూరింది. పొగాకుతో పాటు ఇతర వస్తువులపై పన్నుల ద్వారా రూ.7,386 కోట్లు వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వస్తే మద్యం మినహా మిగతా వస్తువులపై పన్నులు వేసే అధికారం కేంద్రం పరిధిలోకి వెళుతుంది.
ఆర్ఎన్ఆర్ అమలైతే..?
జీఎస్టీ అమలైతే రాష్ట్రాలకు నష్టం కలగకుండా రెవెన్యూ న్యూట్రల్ రేట్ (ఆర్ఎన్ఆర్)ను కేంద్రం అమలు చేసే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను రక్షిస్తారని చెప్పారు. అంటే జీఎస్టీ ద్వారా కేంద్రం ఆయా వస్తువులు, సేవలపై విధించే పన్నుల్లో రాష్ట్ర వాటాను ముందుగానే నిర్ణయిస్తారన్నమాట. దీంతో రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రం చెపుతున్నా... అది సాధ్యం కాదన్నది నిపుణుల మాట. అలాగే జీఎస్టీ అమలయ్యే తొలి రెండేళ్లలో రాష్ట్రం తనకు నష్టం వస్తుందని భావించినప్పుడు సరకుల ఉత్పత్తి స్థానంలో ఒక శాతం అదనంగా పన్ను విధించుకునే అవకాశం కేంద్రం కల్పిస్తుంది. దీనివల్ల ప్రజలపైనే భారం పడనుంది. అలాగే జీఎస్టీ అమలైతే ప్రస్తుతం వ్యాట్ కింద ఉన్న 1.5-14.5 శాతం పన్నుల విధానం 20-22 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
2000లోనే బీజాలు..
జీఎస్టీకి 2000లోనే బీజాలు పడ్డాయి. వాజ్‌పేయి హయాంలో తొలిసారి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే సంవత్సరం కేంద్రం జీఎస్టీపై ఓ సాధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2007 మే 10న అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం సాధికారిక కమిటీతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు అదే సంవత్సరం నవంబర్ 19న నివేదిక ఇచ్చింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 2009 జూలై 6న అప్పటి ఆర్థికమంత్రిప్రణబ్ముఖర్జీ కేంద్రం తరపున ప్రకటన చేస్తూ 2010, ఏప్రిల్ నుంచి జీఎస్టీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించడంతో నిర్ణయం అమలు కాలేదు.