వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఓ లాడ్జిలో తెలంగాణకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కుటుంబ యజమాని మృతిచెందగా అతని భార్య, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రవికుమార్(55) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య పద్మ, కుమారుడు శశి, శంకర్లతో కలిసి మూడు నెలల క్రితం తిరువణ్ణామలై సెంగం రోడ్డులోని వినాయకుడి ఆలయం వీధిలోని లాడ్జిలో అద్దెకు దిగాడు. సోమవారం ఉదయం 10 గంటల వరకు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది కిటికీలను తెరిచి చూడగా నలుగురూ స్పృహ తప్పి పడివున్నట్టు గమనించారు. వెంటనే గది తలుపులు పగలగొట్టి పరిశీలించగా శీతలపానీయాల్లో విషం కలిపి తాగినట్లు గుర్తించారు. వెంటనే నలుగురినీ తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ రవికుమార్ మంగళవారం ఉదయం మృతిచెందగా మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రవికుమార్ కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నానికి అప్పులు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతోనే మూడు నెలల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలై వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి మెరుగుపడితే వివరాలు తెలుస్తాయని పోలీసులంటున్నారు.