ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటుహక్కు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు హజరే శ్రీనివాస్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరి గిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సర్పంచ్‌లకే కాకుండా పూర్వ సర్పంచ్‌లకు కూడా ఈ ఓటు హక్కు వర్తిం చేలా చూడాలన్నారు. రాజ్యాంగంలోని 73వ అధికరణ ప్రకారం పంచాయతీ నిధులు, విధులు గ్రామ సర్పంచ్‌లకే ఇవ్వాలన్నారు.
మైనర్ గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా, మోటారు కరెంట్ బిల్లు, వీధిలైట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వమే భరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎస్ఎఫ్సీ బిల్లులు నేరుగా గ్రామ పంచాయతీలకే చెందేలా చూడాలన్నారు. గ్రామ సర్పంచ్‌లకు రూ.2500 వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్.నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శంకర్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బొడ్డు నిర్మల, సంతోష, బాబు తదితరులు పాల్గొన్నారు.