29 నుంచి తెలుగు హాస్య నాటికల పోటీలు
విజయవాడ కల్చరల్ : సుమధుర కళానికేతన్, ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం సంయుక్త నిర్వహణలో ఈ నెల 29వ తేదీ నుంచి 21వ తెలుగు హాస్య నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు సుమధుర కళానికేతన్ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎన్.మురళీకృష్ణ తెలిపారు. బుధవారం హోటల్ కృష్ణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగే నాటికల పోటీలను మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమధుర కళానికేతన్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తునట్లు పేర్కొన్నారు. మొదటి రోజు ‘తేలు కుట్టిన దొంగలు’ నాటికతో పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. మొత్తం ఎనిమిది నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. 29న నటుడు విద్యాసాగర్‌కు కబీర్దాస్ పురస్కారం, 30న రంగస్థల నటి ఎం.రత్నకుమారికి రాధాకుమారి పురస్కారం, 31న 2016కు గానూ సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్‌రెడ్డిని జంధ్యాల స్మారక పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలిపారు. సుమధర కళానికేతన్ అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు మాట్లాడుతూ ఆదివారం ఉదయం విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సమావేశంలో విద్యావేత్త ఎంసీ దాస్, సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శి చివుకుల సుందరరామశర్మ తదితరులు పాల్గొన్నారు.