రత్నగిరిపై రాజకీయనీడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
రాజకీయ నాయకులు అన్నంత పనీ చేశారు. దైవసన్నిధిలో రాజకీయాలు చొప్పించి సత్యదేవుని ప్రతిష్టను బజారున పడేశారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే వ్రతాలు నిర్వహించే పుణ్యక్షేత్రం ఒక్క అన్నవరం సత్యదేవుని సన్నిధి మాత్రమే. అమెరికాలో కూడా వ్రతాలు జరిపించుకున్న ఖ్యాతి కూడా ఆయనకే సొంతం. అటువంటి దేవుని ప్రతిష్టను అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజకీయ స్వార్థం కోసం మసకబార్చారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ట్రస్టు బోర్డు సభ్యుల నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీ¯ŒS సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబరు 30న ’అన్నవరానికి ధర్మకర్తల మండలి నియామకం’పై వార్తను ’సాక్షి’ ప్రచురించింది. పాలక మండలి నియామకం జరిగినా నేతల నిర్వాకంతో అది చాలా కాలం పెండింగ్లో పడింది. ఎట్టకేలకు ఏడాది తరువాత పాలకవర్గం ఏర్పాటవుతుందనుకుంటుండగా అధికార పార్టీ నేతల నిర్వాకంతో ట్రస్టుబోర్డు ఏర్పాటుకు విడుదల చేసిన జీఓ రద్దయింది.
ట్రస్టుబోర్డులో సభ్యుల ప్రాతినిధ్యంపై టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ తోట నరసింహంల మధ్య వివాదం తలెత్తింది. ఎంపీ తోట ప్రతిపాదించిన వ్యక్తిని పక్కనబెట్టి జ్యోతుల ప్రతిపాదించిన వారికి స్థానం కల్పించడం, తుని నియోజకవర్గం నుంచి ఇద్దరికి ప్రాతినిధ్యం ఇవ్వడం, బీజేపీకి చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా జాబితా సీఎంకు వెళ్లడంతో ఆ అంశం టీడీపీలో రచ్చకెక్కింది. ఇదే విషయాన్ని ’సాక్షి’ గత నెల 26న ’సత్తెన్నకు తప్పని ’దేశం’ సతాయింపు’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది.
ఆశావహులకు నిరాశే..
ట్రస్టుబోర్డులో సభ్యత్వం ద్వారా పవిత్రమైన సత్యదేవుని సన్నిధిలో సేవ చేసే అవకాశం లభిస్తుందని చాలా మంది ఆశించారు. ఆ క్రమంలోనే 13 సభ్యత్వాలకు 500 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. అందులో కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తడంతో రెండేళ్ల కాలపరిమితితో ఏర్పాౖటెన ట్రస్టుబోర్డు రద్దుకు దారితీసింది.కనీసం ఈ సారి విడుదలచేసే నోటిఫికేష¯ŒSలో అయినా వివాదాలకు తావులేకుండా నేతలు తమ స్వార్థాన్ని వీడాలని, నియామకంలో పారదర్శకతను పాటించి సత్యదేవుని ప్రతిష్టను కాపాడాలని భక్తులు
కోరుతున్నారు.