నీ ప్రేమలేఖ చూశా.. నే గాయపడిన చోట...
తెలుగు కవి, దళిత కవి దిగ్గజం పైడి తెరేష్‌బాబు మృతి కవిత్వానికే కాదు సామాజికమార్పు కోసం సాగే తెలుగు సాహితీపోరాటాలకు కూడా తీరనిలోటు. కవిత్వం, కథ, పాట, మాట... ఇలా బహుముఖాలుగా సాగిన తెరేష్ సృజన తెలుగు సాహిత్యాభిమానులకు ఆత్మీయమైనదనడంలో సందేహం అక్కర్లేదు.
నీ ప్రేమలేఖ చూశా... నే గాయపడిన చోట...
ఒక దీపకళిక చూశా... నే శలభమైన చోట...
తెరేష్తో ఎవరు ఏ మెహఫిల్లో కూచున్నా ఈ పాట పాడించుకుంటారు. అతడికి ఉర్దూ అంటే ఇష్టమని, గజల్ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడని, తాను కూడా ఆ మృదువైన సంప్రదాయంలో రాశాడని, అంతకు మించి బాగా పాడతాడని అతడికి సన్నిహితులైన కొద్దిమందికే తెలుసు. తెరేష్ రెండు విధాలుగా రాశాడు. ఒకటి: ఈ లోకంలోని కశ్మలాన్ని, కలుషితాన్ని, పాదాలు ఊరువులు వక్షం శిరస్సులను గర్భస్థావరాలుగా చేసుకుని మనుషులు పుడతారన్న వ్యవస్థని, అందులోని మైలనీ, ఆ మైలకు కొందరిని శాశ్వతంగా బలి చేయాలనుకునే కుట్రని... అందువల్ల నేటికీ కొనసాగుతున్న చీకటిని... దానిని తగులబెట్టేందుకు అవసరమైన చండాలుని చేతి కొరివి వంటి కవిత్వాన్ని... దాన్ని రాశాడు. రెండు: దేశీయ సౌందర్యాన్ని, నల్ల సౌందర్యాన్ని, వాడ సౌందర్యాన్ని, ఆ వంటిళ్లలో ఉడికే తునకల కూర రుచిని, ఆ కచ్చేరీల నిప్పు సెగలో మెరిసే డప్పు వర్ణాన్ని, ఆ దరువుని, సద్దన్నంలో పంటి కింద వచ్చే పచ్చిమిరప చురుకుని, పైగుడ్డ లేకుండా పెరటి వేపచెట్టు కింద పవళించి నిండు సందమామను చూస్తూ మనసు విప్పి పాడుకునే పాటని... దానినీ రాశాడు. తెరేష్‌కు రెండు చేతులా? కవిత్వం రాశాడు. కథలు రాశాడు. పాటలు రాశాడు. నాటకాలు రాశాడు. సినిమాలకు రాశాడు. సీరియల్స్‌కు రాశాడు.
ఇన్ని చేతుల మనిషి ఒక్క బలహీనతతో ఎలా పోరాడలేకపోయాడు?
తెరేష్ చాలా మందికి కనిపించని గురువు. అశ్వాలను అదలాయించి రథాన్ని నడిపిన సారథి. మద్దూరి నగేశ్‌బాబు, తెరేష్ ఒకరి కాంతి మరొకరిపై ప్రసరింపజేసుకుంటూ దళిత కవిత్వం ఆవిర్భావ సమయంలో చేతులు చేతులు పట్టుకొని గబగబా పరిగెత్తుకుంటూ గుండె గుండెకూ చేరడం అందరూ ఆశ్చర్యంతో విభ్రమంతో చూళ్లేదూ? ఇవాళ్టి కవిత నాది... ఈ ఆదివారం నాది... అదిగో చూశావా ఆ వాత నాదే.... ఈ చర్నాకోల దెబ్బ నేను కొట్టిందే. సింహాలు తమ ఆత్మకథలు రాయడం మొదలుపెట్టిన క్షణాలు అవి. వేట చరిత్ర, వేటగాళ్ల చరిత్ర పునర్లిఖింపబడుతున్న సమయం. ఎండ్లూరి సుధాకర్, కత్తి పద్మారావు, శిఖామణి, మద్దెల శాంతయ్య, సతీశ్ చందర్... కొత్త చెప్పుల పరిమళం వంటి కొత్త కవితా పంక్తులను తీసుకొని వస్తుంటే తప్పుకోండి తప్పుకోండి అంటూ తెలుగు కవితా మార్గంలో స్థిరపడి ఉన్న వర్గాలన్నీ, వైనాలన్నీ, వర్ణాలన్నీ తప్పుకుని పంచములకు తల వంచడాన్ని చారిత్రక ఘట్టంగా గమనించలేదూ?
తెరేష్ తొందరపడటం గబగబా రాసి నాలుగు పుస్తకాలు వేసుకొని అవార్డుల కోసం వెంపర్లాడటం ఎవరూ చూడలేదు. ప్రతి మధ్యాహ్నం నిద్ర లేచి ఒక్క కవితన్నా రాయాలి అనే లగ్జరీ అతడికి లేదు. కవిత రాయాలంటే లోన మండాలి. కడుపు కాలాలి. పేగు తెగిపడాలి. నెత్తురు ఉరకలెత్తాలి. నోటి గుండా శషభిషలు లేని మంచి తిట్టు ఒకటి బయటకి ఎగదన్నుకొని రావాలి. ఆ పైన కలం చేతినందుకుని నల్ల సిరాను ద్రావకంలా భగ్గున మండించాలి. తెరేష్ ‘హిందూ మహా సముద్రం’ పేరుతో కవితా సంపుటిని వెలువరించినప్పుడు ఆ శ్లేషకే- ఆ శ్లేష వల్ల ఆ మాటకు వచ్చిన కొత్త అర్థానికే చాలా మంది భయపడిపోయారు. చిన్న పోలికకే ఇంత భయం కలిగితే అందులోని పీడననీ ఆ పీడన తాలూకు పైశాచిక విశ్వరూపాన్ని అనుభవించినవాడు ఎలాంటి కవిత్వం రాస్తాడు? ‘అల్ప పీడనం’ పేరుతో తెరేష్ కవితా సంపుటి వెలువరించినప్పుడు ఇక సమయం వచ్చేసిందనీ ‘అల్పు’లంతా కలిసి తుఫానులా మారి ఈ వర్ణవ్యవస్థ వికృతత్వాన్ని ఎత్తి సముద్రంలో విసిరేయాలని అర్థం చేసుకొని తోడుగా ఎందరో కొత్త కవులు బాణాల్ని ఎక్కుపెట్టలేదూ? వ్యంగ్యం, శ్లేష అనాదిగా పైవర్ణాల ఖడ్గాలు. కాని తొలిరోజు నుంచే వాటిని అందుకొని వాటితోనే ఆ పైవర్ణాల మీద యుద్ధానికి దిగడం ఈ వెనుకబడ్డ ఒంగోలుజిల్లావాడికి కడజాతి వాడికి ఎలా వచ్చింది?
తెరేష్‌కు దృశ్యమాధ్యమం బాగా తెలుసు. ఈటీవీలో ప్రసారమైన విధి, సంఘర్షణ రచయిత అతడే. ‘పైడిశ్రీ’ అతడి కలం పేరు. ఆ అనుభవంతోనే కేవలం ఒక్క కెమెరాను వెంటబెట్టుకొని ఒకరోజులో తాను చూసిన హైదరాబాద్ జీవనాన్ని ‘నేనూ నా వింతలమారి ప్రపంచమూ’ పేరుతో డాక్యుమెంట్ చేశాడు. ‘అమృతవాణి’లో పని చేసినప్పుడు వచ్చిన అనుభవంతో, ఆలిండియా రేడియోలో పని చేయడం వల్ల తేటదీరిన కంఠంతో కవిత్వాన్ని ఆడియో క్యాసెట్లుగా విడుదల చేసి మాట మాటనూ భాస్వరంలా మండించి అక్షరమ్ముక్క రాని దళితులకు వినిపిస్తే అది విని వాళ్లు కన్నీరు కారే కళ్లను చుట్టపొగ వెనుక దాచుకుంటే ధన్యుడనయ్యాను కదా అని పక్కకు వెళ్లి పొగిలి పొగిలి ఏడ్చినవాడు తెరేష్.
ఇంత పేరు వచ్చినా ఇంత ఉగ్ర కవితాశక్తి కలిగినా తెరేష్ మెరమెచ్చులకు పోవడం ఎవరూ చూళ్లేదు. రాసిన పుస్తకాలను ప్రమోషన్ల కోసం తగు మనుషులకు అంకితాలు ఇవ్వడం కూడా చూళ్లేదు. లోకమంతా ఒకవైపు తానొక్కడే ఒకవైపు అన్నట్టు తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణమద్దతు తెలిపి ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టి ‘కావడి కుండలు’ కవితా సంకలనం తెచ్చి ప్రజాసమూహాల మాటా కవి మాటా వేరు వేరు కాదని చెప్పినవాడు తెరేష్.
తెరేష్ జీవితంలో చాలా యుద్ధాలు చేశాడు. తన పుట్టక వల్ల చదువులో చాలా యుద్ధాలు చేశాడు. తన ప్రేమ కోసం మతాంతరపెళ్లి కోసం చాలా యుద్ధాలు చేశాడు. కవిగా తన పతాకాన్ని నిలబెట్టడానికి చాలా యుద్ధాలు చేశాడు. తన కెరీర్లో వివక్ష దరి చేరకుండా చాలా యుద్ధాలు చేశాడు. అన్నింటినీ గెలిచాడు. కాని అనారోగ్యాన్నీ ఆ అనారోగ్యానికి కారణమైన బలహీనతనీ జయించలేకపోయాడు. 50 ఏళ్ల వయసు కూడా లేని తెరేష్. తన సమూహంలో తనలాంటివాడు తయారవ్వాలంటే మరెంత కాలం పడుతుంది అని అలోచించలేకపోయాడా? తాను లేకపోవడం వల్ల తనవాళ్లకు ఎంత నష్టమో ఆలోచించలేకపోయాడా? ఒక మనిషి లేకపోవడం అంటే అతడి చదువు, జ్ఞానం, పోరాటం, సృజన, సుదీర్ఘమైన అనుభవం ఇవన్నీ లేకుండా పోవడమే కదా. తెరేష్... ఎంత పని చేశావు. నీ మరణాన్ని మాకు ప్రేమలేఖలా అందించి వెళ్లావా? నీ ప్రేమలేఖ చూశా... నే గాయపడిన చోట...
- ఖదీర్