తేనిగుంట వద్ద ఏసీబీ తనిఖీలు
తుని రూరల్: తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ తనిఖీ కేంద్రంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సోదాలు చేసి రూ.40,276 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తాము వెళ్లేసరికి చెక్‌పోస్టు సిబ్బంది దగ్గర అనధికారికంగా ఉన్న రూ.27,360తో పాటు.. వారి స్థానాల్లో తమ సిబ్బంది చెక్‌పోస్టు విధులను నిర్వర్తించిన సమయంలో వాహనదారులు రికార్డులు తనిఖీ చేయించుకుని ఐచ్ఛికంగా ఇచ్చిన రూ.13,916 ఉన్నట్టు మురళీకృష్ణ తెలిపారు.
తాము సోదాలు నిర్వహించిన సమయంలో ముగ్గురు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విధుల్లో ఉన్నారని, చెక్‌పోస్టు దగ్గర కార్యకలాపాలు సాగిస్తున్న ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నివేదికను ఏసీబీ డీజీకి అందజేస్తామన్నారు. సోదాల్లో డీఎస్పీలు ప్రసాద్, రమేష్, రమాదేవి పాల్గొన్నారు.