మళ్లీ సర్వేకు వస్తే ఖబడ్దార్
పోలాకి : రాష్ట్ర ప్రభుత్వ జపాన్ కంపెనీతో సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన పోలాకి థర్మల్ పవర్ ప్లాంట్ సర్వేకు సహకరించేది లేదని, మరోసారి సర్వే పేరిట వస్తే ఖబడ్దార్ అంటూ థర్మల్ ప్రతిపాదిత గ్రామస్తులు అధికారులను హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ థర్మల్ సర్వేను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాలైన చీడివలస, గవరంపేట, ఓదిపాడుల్లో తహశీల్దార్ జెన్ని రామారావు, జెన్కో ఏఈ టీవీ మధు ఆధ్వర్యంలో మంగళవారం అధికారుల బృందం పర్యటించింది. ప్రస్తుత సర్వే కేవలం భౌగోళిక స్థితిగతులపై అంచనా వేసేందుకు మాత్రమేనని ప్రజలు సహకరించాలని నచ్చజెప్పేందుకు అధికారులు చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది.
మరోసారి సర్వేకు రావద్దని ప్రజలు గట్టిగానే హెచ్చరించారు. ముందుగా చీడివలస గ్రామానికి చేరుకున్న అధికారులకు అక్కడి యువకులు గోబ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఓదిపాడు, గవరంపేటల్లో కూడా అధికారులను అడ్డుకున్నారు. అభివృద్ధి పేరిట మా బతుకులు బుగ్గి చేయొద్దని నిజంగా అభివృద్ధి చేయూలంటే ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ సంస్థలను నిర్మించాలని, మా భూములు ఇచ్చేందకు సిద్ధంగా ఉన్నామని తహశీల్దార్ బృందానికి వినతిపత్రాలు అందజేశారు. మహిళలు సైతం అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.
సర్వే నిలుపుదల చేస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. అధికారుల బృందంలో ఆర్ఐ బాలకృష్ణ, వీఆర్వోలు కృష్ణమోహన్, వెంకటరమణ ఉన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, ఇతర నాయకులు కె.సురేష్‌బాబు, నీలంరాజు, కోట అప్పారావు ప్రజలకు మద్దతుగా నిలిచారు. పోలాకి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రెచ్చగొట్టొద్దు...
థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణాలకు జిల్లాలో వ్యతిరేకత వుంది. సర్వే పేరుతో ప్రజలను రెచ్చగొట్టవద్దు. గతంలో కాకరాపల్లి, సోంపేటలలో కూడా అనవసరంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకత తెలుపుతున్నా వినిపించుకోవటం లేదు. జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, అధికారులే వహించాల్సి వుంటుంది.
-కోట అప్పారావు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు