కాస్త పాజిటివ్‌గా ఆలోచించాలి
జీవితం కొట్టిన చావు దెబ్బలను తట్టుకుని నిలబడ్డ ఓ సాధారణ గృహిణి ఆమె. తమ జీవితం ముగిసిపోయిందనుకుంటున్న ఎందరికో పునర్జీవితం అందిస్తున్న ఆత్మబంధువు ఆమె. తన కష్టాలను అధిగమిస్తూ.. తన లాంటి వారి కన్నీళ్లను తుడుస్తున్న ఆమె ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ధైర్యం. ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం... నా పేరు మజ్జి పద్మావతి.. ‘విజయ పాజిటివ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థలో 2005లో నేను మొదటగా కౌన్సిలర్‌గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్నాను. మా దగ్గర 7300 మంది హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు నమోదు చేసుకుని ఉన్నారు. వాళ్లలో ఎక్కువ మంది యంగ్ విడోస్‌తో పాటు పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలే. ఆ సమస్య నుంచి వారు బయట పడేందుకు, వారికి ఒక ఆశ కల్పించేందుకు గత ఏడాది అక్టోబరు 28న అధికారికంగా హెచ్ఐవి మ్యారేజ్ బ్యూరో ఒకటి ఆరంభించాం. ఇప్పటికే దాదాపు 150 పైగా జంటలను ఒకటి చేశాం. ఆధారం లేని జంటలను కలిపి వారికి ఒక కొత్తకుటుంబాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నానో చెప్పాలంటే ముందు నా గురించి మీకు తెలియాలి.. మా సొంతూరు పార్వతీపురం. పదవతరగతి అయిన వెంటనే పెళ్లి అయ్యింది. ఆరు నెలల తరువాత నా భర్తకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం తెలిసింది. అప్పటికి నేను గర్భవతిని. పెళ్లైన మూడేళ్లకే ఆయన చనిపోయారు. ఆ షాక్‌లో నేను మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయాను. అప్పటికి పాప పుట్టింది. ఒకసారి ప్రభుత్వాసుపత్రిలో టెస్టులు చేయించుకున్నాను. టెస్టుల్లో నేను పాజిటివ్ అనే భయంకర నిజం తెలిసింది. ఆశ ప్రోగ్రామ్‌కు వెళ్లాను. అక్కడ హెచ్ఐవీ పాజిటివ్స్ 30 మంది ఉన్నారు.
అత్తవారింట్లో ఆదరణ కరువైంది. న్యాయంకోసం లోక్ అదాలత్‌లో కేసు వేశాను. మూడు సంవత్సరాలు పాటు కోర్టు చుట్టూ తిరిగాను. ప్రతి కలెక్టర్‌ను, ప్రతి జడ్జిని కలిశాను. ఫలితం లేదు. అయితే ఈ పోరాటంతో నా జీవితంలో మరో మజిలీ మొదలైంది. ‘విజయ పాజిటివ్ పీపుల్’తో బంధం ఏర్పడింది. హెచ్ఐవి వాళ్లను గుర్తించడం, వారికి మెరుగైన జీవితం అందించడంపై కృషి చేయడం, ప్రభుత్వ పథకాలతో వారిని అనుసంధానించడం వంటివి చేస్తున్నాను. పాజిటివ్స్‌పై ఎవరైనా వివక్ష చూపిస్తే వెంటనే అక్కడకు వెళతాం. వారికి కోర్టు ద్వారా గాని పోలీస్‌ల ద్వారా గాని రక్షణ కల్పిస్తాం. 2008లో నా జీవితం మరో మలుపు తిరిగింది. నేను ప్రతీ ఊరు వెళ్లి హెచ్ఐవీ గురించి అవగాహన తరగతులు చెప్పేదాన్ని.. శ్రీకాకుళం, బెంగుళూరు, ఒరిస్సా వరకు మీటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఆ సమయంలో నన్ను చూసి, నా గురించి అన్నీ తెలిసి, మంచి వ్యక్తి ఒకరు నాకు కొత్తజీవితాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయన మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇష్టపూర్తిగా నన్ను ద్వితీయవివాహం చేసుకున్నాను. మా కుటుంబం, అత్త, మామ అందరూ ఇప్పుడు విజయనగరంలోనే ఉంటున్నాం.
హెచ్ఐవీతో ఉన్న వారే ‘విజయ పాజిటివ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా ఉంటారు. 2003లో బీఎస్ఆర్ మూర్తి ద్వారా ఈ సంస్థను ఏర్పాటయ్యింది. అన్ని మందుల కంటే మనోధైర్యమే హెచ్ఐవికి మందు. సేవ చేసినందుకు మేం డబ్బులు తీసుకోం.. పాజిటివ్స్ ముఖంలో చిరునవ్వు చూడటమే మా లక్ష్యం.. రాష్ట్రంలో 3.60 లక్షల మంది హెచ్ఐవీ పీడితులుంటే విజయనగరం జిల్లాలో 14 వేల మంది పైగానే మా సంస్థలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు కాకుండా, ప్రైవేట్‌గా మందులు వాడే వాళ్లు చాలా మందే ఉన్నారు. క్లాసుల మూలంగా కొంత కాలంగా అవగాహన, జాగ్రత్తలు పెరిగి వ్యాధి వ్యాప్తి 30 శాతం వరకు తగ్గింది. మా దగ్గరకు మ్యారేజ్ కోసం ఎక్కువగా అబ్బాయిలు వస్తుంటారు. వారి బయోడేటా తీసుకుని మూడు నెలలనుంచి మూడు సంవత్సరాలు వరకు వారిని పరిశీలిస్తాం. వారి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర అంశాలను గుర్తిస్తాం. భార్యను చూసుకోగలరా లేదా అని తెలుసుకుంటాం. అన్నీ బాగున్నాయంటే వారికి సంబంధం కుదిర్చి పెళ్లి చేస్తాం. వాటిలో కొన్ని కులాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సొంత ఖర్చులతోనే ఈ వివాహాలు చేస్తున్నాం. మాకు వీహాన్ ప్రోగ్రాం ద్వారా రోజుకి రూ. 300 జీతం వస్తుంది. ఇంతకుమించి మాకు ఎలాంటి ఫండ్స్‌గానీ.. ప్రాజెక్టులు కానీ లేవు.. బడ్జెట్లు కూడా లేవు. వీటన్నిటినీ మించి ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత కూడా ఆ భయాన్ని వీడి బతికే ధైర్యాన్ని కల్పిస్తున్నాం అన్న ఆత్మసంతృప్తి మాత్రం చాలా ఉంది. అది చాలు మాకు.
– బోణం గణేష్, సాక్షిప్రతినిధి, విజయనగరం