చలించని భక్తికి ప్రతీక.. శూలాల వేడుక..
-నగరంలో సుబ్రహ్మణ్యస్వామి తిరువీధి ఉత్సవం
-వంటిపై శూలాలు గుచ్చుకుని మొక్కు తీర్చుకున్న భక్తులు
రాజమహేంద్రవరం కల్చరల్ : వంటికి పూచికపుల్ల తాకితేనే విలవిలలాడతారు కొందరు. అలాంటిది వారు శూలాలనే దేహంలోని వివిధ భాగాల్లో అవలీలగా గుచ్చుకున్నారు. ఆ శూలాలతోనే తిరువీధి ఉత్సవంలో అలవోకగా పాల్గొన్నారు. లాలాచెరువు బర్మాకాలనీలో వేంచేసి ఉన్న శ్రీసుబ్రహ్మణ్యస్వామి తిరువీధి ఉత్సవం నిబద్ధతతో భక్తులు సంతరించుకునే శక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈనెల 3న ఆలయంలో ప్రారంభమైన స్వామివారి ఉత్తర ఫల్గునీ పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం పుష్కరాలరేవులో కలశస్థాపన అనంతరం విశాఖ నుంచి వచ్చిన గురుస్వాముల పర్యవేక్షణలో మొక్కు ఉన్న భక్తులు శూలాలు గుచ్చుకుని తిరువీధి ఉత్సవంలో పాల్గొన్నారు. వారికి ఇతర భక్తులు పాదాభివందనం చేశారు. వందలాది భక్తుల శరవణఘోషతో ఉత్సవం పుష్కరాలరేవు, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, హోటల్ షెల్టాన్, శీలం నూకరాజు రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ప్రత్యేకరథం అనుసరించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, కార్యదర్శి సీహెచ్ మురళీకృష్ణ, కోశాధికారి నరసింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.