Thomas Alva Edison
-
కాలం సాక్షిగా చెప్పే సత్యం
మానవ జీవితం చాలా అమూల్యమైనది. అది ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. అల్లాహ్ దాన్ని రహస్యంగా ఉంచాడు. దాన్ని ఛేదించే శక్తిని ఎవ్వరికీ ప్రసాదించలేదు. కనుక జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడం పైనే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. డబ్బు, గౌరవం, ఉద్యోగం, అధికారం, హోదా ఏదైనా కావచ్చు, అది సాధ్యమే. కాని కాలాన్ని మాత్రం ఎంత ధనం ధారపోసినా, ఎంతపలుకుబడి ఉపయోగించినా సాధించలేము. గడిచినకాలం – అది రెప్పపాటైనా సరే – కోట్లు కుమ్మరించినా మనకు లభించదు. ఇది కాలం చెప్పే సత్యం. మనం దాని విలువను గుర్తించకపోతే అది మనకోసం ఆగదు. గోడకు అమర్చినగడియారం ముల్లు ‘టిక్ టిక్’ మని శబ్దం చేస్తూ తన పని అది చేస్తూనే ఉంటుంది. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోగలిగినప్పుడే అది మనకు ఉపకరిస్తుంది. లేకపోతే అది మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ముందుకు సాగిపోతుంది. అందుకని మనం ఏవిషయంలో అయినా సకాలంలో స్పందించగలగాలి. సమయం మించి పోయిన తరువాత తీరిగ్గా విచారిస్తే ప్రయోజనం ఉండదు. అవకాశాలు ఎప్పుడూ మనకోసం నిరీక్షిస్తూ ఉండవు. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.మనమే వాటిని అందిపుచ్చుకోవాలి. అవి మనవద్దకు రావాలని ఆశించడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏది అవసరమో దానిపై దృష్టి కేంద్రీకరించాలి. బాధ్యతల నిర్వహణలో అలసత్వాన్ని ఎంతమాత్రం దరిచేరనీయకూడదు.ఎందుకంటే, ఈరోజు చేయవలసిన కార్యాన్ని రేపటికి వాయిదా వేశామంటే కాలం విలువను మనం గుర్తించనట్లే లెక్క. ఈనాటి కొద్దిపాటి అలక్ష్యం రేపటి బాధ్యతను రెట్టింపుచేస్తుంది. ఒకటికి రెండు తోడై, బాధ్యతలు పేరుకు పోతాయి. ఇక ఆతరువాత బాధ్యతల నిర్వహణ తలకుమించినభారంగా పరిణమించి, పలాయనవాదాన్ని ఆశ్రయించే దుస్థితికి తీసుకువస్తుంది. అద్భుతమైన విజయాలను సాధించినవారి జీవితాలను పరిశీలిస్తే, వారు కాలాన్ని(సమయాన్ని) ఎలా తమకు అనుకూలంగా మలచుకొని, సద్వినియోగం చేసుకొని, కొత్త అవకాశాలను సృష్టించుకున్నారో, కొంగ్రొత్త ఆవిష్కరణలకు ఎలా నాంది పలికారో మనకు అర్ధమవుతుంది.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ తన జీవితకాలంలో వెయ్యికంటే ఎక్కువ నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. వాటిలో గ్రామ్ ఫోన్, విద్యుత్తుబల్బు అతని ఆవిష్కరణలే అని మనందరికీ తెలుసు. ఇది ఎలాసాధ్యమైంది? అతను కాలం నాడిని ఒడిసిపట్టి, దాన్నిసద్వినియోగం చేసుకున్నాడు. కాలక్షేపం కోసం కాలాన్ని దుర్వినియోగంచేయలేదు.సరదాలు, సొల్లుకబుర్లకోసం సమయాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అతను, తనప్రయోగశాలనే వినోదశాలగా మార్చుకున్నాడు. చేస్తున్న పనిలోనే ఆనందాన్ని, వినోదాన్ని అనుభవించాడు. కాలం విలువను గుర్తించబట్టే, విద్యుత్ బల్బును కనుగొనే సమయంలో ఏకధాటిగా పన్నెండు, పదమూడు రోజులు ప్రయోగశాలలోనే నిద్రలేని రాత్రులు గడిపాడు.అందుకని కాలం విలువను, ప్రాధాన్యతను గుర్తించాలి. పవిత్రఖురాన్ కూడా ‘కాలం సాక్షిగా’ మానవాళికి అనేక హితబోధలు చేసింది. కాలగతిలో కలిసిపోయిన వారి గాథల్ని గుణపాఠాలుగా వివరించింది. బుద్ధిజీవి అయిన మానవుడు ఈ హితోపదేశాలకనుగుణంగా నడచుకొని ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందాలని ఆశిద్దాం. ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఎడిసన్ ఉప్పు ఫార్ములా!
సమస్యను కొత్త కోణంలో చూడండి విద్యుత్ బల్బుతోపాటు ఎన్నో వస్తువులను కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన అమెరికా పరిశోధకుడు థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం చాలా భిన్నంగా ఉండేది. తన పరిశోధనలకు అవసరమైన సహాయకులను ఎడిసన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తూ ఉండేవారు. మొదట సాధారణ ప్రశ్నలు అడిగిన తర్వాత.. తనకు తగిన అభ్యర్థి అనిపిస్తే అతడిని భోజనానికి తీసుకెళ్లేవారు. ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉండేది. భోజనం వచ్చిన తర్వాత ఎడిసన్ కొంత తీసుకొని నోట్లో వేసుకొనేవారు. ఈ ఆహారంలో ఉప్పు సరిపోలేదనుకుంటా! అంటూ అభ్యర్థిని నిశితంగా పరిశీలించేవారు. అప్పుడు సదరు అభ్యర్థి కూడా కొంత భోజనాన్ని రుచి చూసి, ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెబితే అతడు ఎంపికైనట్లే. కానీ రుచి చూడకుండానే ఉప్పును కలుపుకుంటే.. ఇంటి ముఖం పట్టాల్సిందే. మనుషుల మనస్తత్వం ఎడిసన్‌కు బాగా తెలుసు. మానవులు సాధారణంగా ఇతరులు చెప్పినదాన్నే గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏదైనా అంశంపై తమకు తగిన అనుభవం, పరిజ్ఞానం లేకపోయినా దానిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాన్నే అనుసరిస్తుంటారు. తమకు ఎదురైన సమస్యను కొత్త కోణంలో చూడడం, దాని పరిష్కారానికి భిన్నంగా ఆలోచించడం ఎక్కువ మందికి అలవాటు లేని పని. మనసులో ఒక అభిప్రాయం నాటుకుపోతే.. ఇక దాన్ని ఎప్పటికీ వదులుకోరు. ఇతరుల ఆలోచనలను అనుసరించకుండా సొంతంగా ఆలోచించే వ్యక్తుల కోసం ఎడిసన్ గాలిస్తూ ఉండేవారు. ప్రయత్నమే మూలాధారం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు రావాలంటే చాలా కష్టం.. అని మీ స్నేహితులు మీకు చెప్పే ఉంటారు. దాంతో మీరు అది నిజమేననుకుంటారు. మీ ఆలోచనలు అలాగే మారిపోతాయి. ఐఐటీలో సీటు మనకెక్కడ వస్తుందిలే అని తీర్మానించుకుంటారు. ‘సీటు తెచ్చుకోవడం నా వల్ల కాదు’ అనే దృక్పథం మీలో బలంగా ఏర్పడుతుంది. ఐఐటీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి కూడా సంకోచిస్తారు. ఇతరులెవరో సాధించలేదు కాబట్టి మీరు కూడా సాధించలేరని అనుకుంటారు. అలా అనుకోవడం తెలివైన లక్షణం కాదు. ఐఐటీలో సీటు తెచ్చుకోవడం కష్టమే కావొచ్చు.. కానీ ప్రతిఏటా వందలాది మంది సీటు సాధిస్తున్నారు కదా! వారు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? కాబట్టి ఓపెన్ మైండ్‌తో ఉండండి. నేను తప్పకుండా సాధించగలను అనే సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి. అప్పుడు ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతిభ, మేధస్సు ఉండగానే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది చేసి చూపుతారు. జీవితంలో కోరుకున్న మార్పు రావాలంటే ప్రయత్నమే మూలాధారం. సొంత ఆలోచనలతో ముందుకు ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇతరుల ఆలోచనా దృక్పథం మీకు పనికి రావొచ్చు, రాకపోవచ్చు. మీరు చేయగలిగే, చేయలేని.. మీకు సాధ్యమయ్యే, సాధ్యం కాని పనిని ఇంకెవరో నిర్ణయించే పరిస్థితి తెచ్చుకోవద్దు. పరిశ్రమల యాజమాన్యాలు, బిజినెస్ స్కూల్స్, మొత్తం ప్రపంచం.. ఇప్పుడు సొంత ఆలోచనలతో ముందుకెళ్లే అభ్యర్థుల కోసమే వెతుకుతున్నాయి. అపజయాలే విజయానికి సోపానాలు మీకు ప్రేరణ కల్పించే గొప్ప వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారా? ఎడిసన్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఆయన బాల్యంలో పెద్ద ప్రతిభ ఉన్న విద్యార్థి కాదు. పైగా చెవుడు కూడా ఉంది. పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎడిసన్ తన ఇంట్లోనే విద్యాభ్యాసం కొనసాగించారు. ఎన్నో వస్తువులను కనిపెట్టారు. వైఫల్యాలు ఎదురైనా ముందుకే వెళ్లారు. అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. ప్రతి ఓటమి నుంచి ఓ విలువైన పాఠం నేర్చుకున్నానని ఆయన స్వయంగా చెప్పారు. ఎడిసన్ కీర్తి కిరీటంలో ఎన్నో పేటెంట్లు ఉన్నాయి. అలుపెరుగక శ్రమించే తత్వంతోనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. మీ కృషికి సొంత ఆలోచనలను జోడించండి. రుచి చూడకుండానే భోజనంలో ఉప్పు వేసుకోకండి!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
గురువుకు వందనం...
‘నువ్వు’ ‘నేను’ ఈ అక్షరాలను చదవగలుగుతున్నామంటే దానికి కారణం ఒక ఉపాధ్యాయుడు. ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెబుతూ... ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఒక పరిపాలకుడు, ఒక శాస్త్రవేత్త, ఒక పాత్రికేయుడు, ఒక ఇంజినీర్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక జవాన్, ఒక గాయకుడు, ఒక ఆటగాడు... వీరందరి వెనుక స్త్రీ ఉన్నా, లేకపోయినా ఆశయసాధన సాధ్యమే! కానీ ప్రతివారి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడు ఉండి తీరతాడు. ఉపాధ్యాయుడికి వయసు ఉండదు. ‘‘తల వంచి కైమోడ్చే శిష్యుడవు నీవైతే, నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే’’ అన్న సిరివెన్నెలగారి మాటలు అక్షరాలా సత్యములు. నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి నీ శిష్యుడవు నువ్వే. నువ్వే నీకు నిన్ను నేర్పించుకునే ఆచార్యుడవు. సర్వేపల్లి రాధాకృష్ణగారి జీవితం ఇందుకు ఉదాహరణ. ఆయన బి.ఏ. చదివే రోజుల్లో ఒక పుస్తకం రాశారు. ఆయన ఎం.ఏకి వచ్చేనాటికి ఆ పుస్తకం టెక్ట్స్ బుక్ అయ్యిందట! గురుశిష్యుల సంబంధానికి వయసు ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. లియోనార్డో డావిన్సీకి, రైట్ బ్రదర్స్‌కి ఎగిరే పక్షి టీచర్... థామస్ ఆల్వా ఎడిసన్‌కి టంగ్స్టన్ వాడకముందు పగిలిపోయిన బల్బులే టీచర్. గజగజ వణికిన అర్జునుడికి చుట్టూ తన సోదరులు, శ్రేయోభిలాషులు ఉన్నా తన భారాన్ని మొత్తం భరించి గీత సారం బోధించి, అక్కడికక్కడే ప్రాక్టికల్స్ చేయించిన ప్రొఫెసర్ శ్రీకృష్ణుడు కాదా? ఉపాధ్యాయుడు మనిషి రూపంలోనే ఉండనవసరం లేదని ఏకలవ్యుడు నిరూపించాడు. కేవలం విగ్రహం నుండే స్ఫూర్తి పొంది విలుకాడు అయ్యాడు. రేపటి భారతానికి స్తంభాలు విద్యార్థులైతే... ఆ స్తంభాలను కట్టేది ఒక ఉపాధ్యాయుడు. రేపటి పౌరులని తీర్చిదిద్దే ఆర్కిటెక్ట్ ఆయన. ఒక పిల్లవాడికి దేవుడు... తల్లిదండ్రులని ప్రసాదిస్తే, సమాజం ఇచ్చే తల్లి తండ్రి మాత్రం ఉపాధ్యాయుడే. తనకున్న విజ్ఞానంతోపాటు విలువలని నేర్పిస్తాడు. పద్య గద్య, సాహిత్యాల్లోని అందాన్ని, ఒక శ్రీనాథుడిగానో, షేక్స్పియర్లానో మారిపోయి మన కళ్లకి కట్టినట్టు చూపిస్తున్నాడు. వెనువెంటనే సోక్రటీస్లాగ, స్వామివివేకానందలాగ మారి ఆ పాఠం యొక్క మూలాన్ని, దానిలోని సారాన్ని మన ఎదిగే మెదడులోకి ఎక్కిస్తాడు. ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందుకేనేమో ఈ ఇరువురి సంబంధం ప్రత్యేకమైంది. నీలో టాలెంట్‌ని మొదటగా గుర్తించి ముందుకు వెళ్లే ధైర్యం ఇచ్చాడనేమో ఇంత అభిమానం. అందుకే ఒకరిని ఒకరు విడిచి వెళ్లాల్సిన సమయంలో ఆ కన్నీరు. మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. అలా ఒక విద్యార్థి మనస్తత్వానికి తగ్గట్టు ఉపాధ్యాయుడు కూడా మారతాడు. నిన్ను కొడతాడు... దొంగచాటుగా నీ నుండి తిట్లు తింటాడు. కానీ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిన వాళ్లంతా చిన్నతనంలో వాళ్ల మ్యాథ్స్సర్తో రేపు వీపు బద్దలు కొట్టించుకునే ఉంటారు, ఫిజిక్స్ సర్‌తో చెవి మెలి పెట్టించుకునే ఉంటారు, ఇంగ్లిష్ సర్‌తో స్కేల్ బలాన్ని రుచి చూసే ఉంటారు. అవును... నిన్ను మార్చాలి... బతిమాలినా, భయపెట్టినా, ఏదో ఒకటి చేసి నిన్ను తీర్చిదిద్దాలంటే. అందుకేనేమో ఎన్ని వృత్తులు ఉన్నా టీచర్ పదవికి వన్నె, విలువ తగ్గనిది. అదే ఆయన అలిగి ఉంటే రాజులు, రాజ్యాలు, శాస్త్రాలు, సూత్రాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేవి. గడిచిపోయిన నిన్నటిని ఇంకా పుస్తకాల్లో దాచి నేటికి పరిచయం చేసి, రేపటిని నిర్మిస్తున్నాడు. నీ విజయంలో నీ వెనుక ఉంటూ నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. - జాయ్