భర్త మృతికి కారణమైన భార్య సహా ముగ్గురికి రిమాండ్
హైదరాబాద్: భర్త వేధింపులకు తాళలేని ఓ మహిళ.. తన తోబుట్టువుల సాయంతో అతడిపై దాడి చేయటంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులు ముగ్గురినీ రిమాండ్కు తరలించారు. వివరాలు.. తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివీ.. అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్నగర్కు చెందిన వల్లెపు రాజు(35), రజిత(30) దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం.
అయితే, భర్త రోజు మద్యం తాగి భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు. వేధింపులు తాళలేని రజిత ఆదివారం రాత్రి ఇంటి సమీపంలోనే ఉండే తన సోదరుడు సమ్మయ్య, అక్క కొమురమ్మలతో కలిసి రాజును విపరీతంగా కొట్టారు. సోమవారం ఉదయం కూడా రాజు గొడవకు దిగడంతో మళ్లీ కొట్టి మెట్లపై నుంచి కిందికి లాక్కుని వచ్చారు.
ఆ సమయంలో తల మెట్లకు తగలడంతో రాజు సృ్పహ కోల్పోయాడు. వెంటనే రాజు తల్లి సారమ్మ గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే, పరిస్థితి విషమించి రాజు మృతి చెందాడు. తన కొడుకు మరణానికి కారణమైన అతని భార్య, ఆమె సోదరుడు, సోదరిలపై తుకారాంగేట్ పోలీస్స్టేషన్లో సారమ్మ ఫిర్యాదు చేసింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం రిమాండ్కు తరలించారు.
(అడ్డగుట్ట)