శ్రీనగర్ లో చెలరేగిన అల్లర్లు...ఉద్రికత్త
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం దగ్గర గురువారం మళ్లీ ఉద్రిక్తత రాజుకుంది. అదృశ్యమైన యువకుడు ఒవైసిస్ బషీర్ మాలిక్ మృతదేహాన్ని స్థానిక రైల్వే బ్రిడ్జ్ దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి నిరసనగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఆందోళనకారులు ధర్నాకు దిగారు. యువకుని మృతదేహంతో ఆందోళనకు దిగి రహదారిని దిగ్బంధించారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువును ప్రయోగించిని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కాగా కనపించకుండాపోయిన యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై తేలడంతో వివాదం చెలరేగింది. అతని గొంతు కోసి హత్య చేశారనే అనుమానంతో కొంతమంది ఆందోళనకు దిగారు. దీంతో శ్రీనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.