స్మోకర్ల అనారోగ్యం బాధ్యత సిగరెట్ కంపెనీలదే
ధూమపాన ప్రియుల చెవులలో తేనెలూరే వార్త ఇది. ఏళ్లపాటు దమ్ముమీద దమ్ము లాగి.. గుండె, ఊపిరితిత్తులూ, రక్తనాళాల్లో పొగచూరుకుపోయి.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారినపడినా ఏం ఫర్వాలేదిప్పుడు! ఎందుకంటే స్మోకర్ల అనారోగ్యానికి ఆయా సిగరెట్ కంపెనీలదే పూర్తి బాధ్యత. అలా ఇప్పటివరకూ ఆరోగ్యం చెడిపోయిన వారికి నష్టపరిహారంగా రూ.750 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఏ కోర్టు? ఏమిటా ఆదేశాలు? అంటారా..
కెనడాలోని కుబెక్ ప్రావిన్స్ సుపీరియర్ కోర్టు సోమవారం ఈ సంచలన తీర్పును ప్రకటించింది. సిగరెట్లు తాగడం వ్యసనంగా మారిందని, దానివల్ల తమ ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించాయని, ఇందుకు సిగరెట్లు తయారుచేసిన కంపెనీలదే బాధ్యత అని ఆరోపిస్తూ 1998లో కొద్ది మంది స్మోకర్లు కోర్టుకెక్కారు. 17 ఏళ్ల తర్వాత ఇటీవలే ఆ కేసును విచారించిన కోర్టు.. ప్రఖ్యాత ఇంపీరియల్ టొబాకో, బెన్సన్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్ డోనాల్డ్ టొబాకో కంపెనీలను నిందార్హమైనవిగా పేర్కొంది. బాధితులకు 12 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.
అలా ఎలా సాధ్యమైందంటే.. ప్రస్తుతం మనదేశంలో అమలవుతున్నట్లు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులపై నిషేధిత ఆజ్ఞలేవీ కెనడాలో లేవు. పొగతాగడం హాని కరం అనే హెచ్చరికలు జారీ చేయకపోవడం కంపెనీల బాధ్యత అని, అలా చేయనందుకే ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.