రామరాజ్యంలోనూ రేప్‌లు జరిగాయన్న డీజీపీ!
లక్నో: రామ రాజ్యంలోనూ రేప్ లు జరిగాయట.. మహిళలపై అత్యాచారాలు చాలా కామన్ అట.. వాటిని నిరోధించడం ఎవరివల్లా కాదట.. చివరికి పోలీసుల వల్లా కాదంటూ చెత్తులెత్తేసిన పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ. ఉత్తరప్రదేశ్ డీజీపీ జగ్ మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
త్వరలో రిటైర్ కాబోతున్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ అసహనంగా స్పందించారు. జర్నలిస్టులపై రెచ్చిపోయారు. అత్యాచారాలు చాలా సాధారణమని, రామరాజ్యంలో కూడా రేప్‌లు జరిగాయంటూ వివాదాస్పదంగా మాట్లాడి సంచలనం రేపారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల గురించి మీడియా ప్రశ్నించినపుడు.. ''మహిళలపై అఘాయిత్యాలను ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి. రామరాజ్యంలో కూడా రేప్ లు జరిగాయి'' అంటూ మీడియాపై ఎగిరిపడ్డారు. దీనిపై మరింత వివరణ కోరిన జర్నలిస్టుతో 'నన్ను ప్రైవేట్ గా కలువు, అప్పుడు దీనికి జవాబు చెబుతా' అన్నారు. మహిళలపై అత్యాచారాలను పోలీసులు కూడా పూర్తిగా అరికట్టలేరంటూ తేల్చి పారేశారు.
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన రాష్ట్ర డీజీపీ వివాదాస్పదంగా స్పందించడంపై పలువురు మండిపడుతున్నారు. డీజీపీ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు, మహిళా, ప్రజాసంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. ఆయన పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ డిమాండ్ చేశారు.