జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకోం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పు వెనుక మతలబు ఏమిటని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. అన్ని అనుమతులు సాధించి పనులు జరుగుతున్న ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా.. ఏ అనుమతులు లేని, నీటి కేటాయింపుల్లేని శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు ఇస్తామనడం నమ్మశక్యంగా లేదన్నారు. కేంద్ర జలసంఘం, అటవీ, పర్యావరణ, సాంకేతిక, ఆర్థిక అనుమతులు పొంది శరవేగంగా జరుగుతున్న చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ను అకస్మాత్తుగా మార్చడంలో మతలబేమిటో తెలియడం లేదని చెప్పారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడిలో చేవెళ్ల - ప్రాణహిత పనులను పరిశీలించిన ఉత్తమ్.. అనంతరం వికారాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ మహాధర్నాలో పాల్గొని ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రాణహితకు అంకురార్పణ చేశారని, ఆ తరువాతే 16 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పనులకు పునాది రాయి పడిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, నిధులు కేటాయించాలని పదే పదే హస్తినకు వెళ్లి కేంద్రాన్ని అభ్యర్థించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హఠాత్తుగా ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.వేల కోట్ల విలువైన పనులు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని, డిజైన్ మారిస్తే ఏ పోరాటానికైనా సిద్ధమన్నారు. కుటుంబ సభ్యులకు కమీషన్లు వచ్చే పనులపై శ్రద్ధ పెడతారు తప్ప.. పేదల సంక్షేమం పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఉత్తమ్ ఆరోపించారు. సచివాలయం తరలింపు, ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేత, ఆకాశహర్మ్యాలు, హుస్సేన్‌సాగర్ ఖాళీ అంటూ రోజుకో మాటతో మోసపూరిత ప్రకటనలతో కాలం వెళ్లదీస్తున్న కేసీఆర్ సర్కారుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పేదలందరికీ రెండు పడకల ఇల్లు కట్టించి ఇస్తానని ఆశలు రేపిన సీఎం.. అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ బెడ్రూమ్ కూడా కట్టించి ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.
తమ హయాంలో నిర్మించిన నాలుగున్నర లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల బిల్లులు చెల్లించకుండా.. సీఐడీ దర్యాప్తు పేరిట కాలయాపన చేయడం దారుణమని అన్నారు, రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వకపోవడంతో కాలేజీలు మూతపడుతు న్నాయన్నారు. 14 నెలల్లో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం, మంత్రులకు సమయం.. మానవ త్వం లేదా అని అన్నారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు లేనట్లే: షబ్బీర్
ముస్లింలకు విద్య, ఉద్యోగాల భర్తీలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రాజకీయ ప్రయోజనాలకేనని తేలిపోయిందని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. 12 శాతం రిజర్వేషన్లు ఆచరణ సాధ్యం కాదని సుధీర్ కమిటీ స్పష్టం చేసినందున.. కేసీఆర్‌పై ముస్లింలకు భ్రమలు తొలిగిపోయాయన్నారు.
ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసగించిన టీఆర్ఎస్ మంత్రులు ప్రజలకు ముఖం చూపలేక దొంగలమాదిరి గా పారిపోతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, సుధీర్‌రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.