కేసీఆర్‌కు ఓటమి భయం.. అందుకే ఫిట్మెంట్ లీక్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల రెండు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు ఓడిపోతారన్న భయం సీఎం కేసీఆర్‌కు పట్టుకుందని, అందుకే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఉద్యోగ సంఘం నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని 29% ఫిట్మెంట్ ఇస్తానని లీక్ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచా రంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహిం చిన సభలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉపఎన్నికల భయం కూడా కేసీఆర్‌ను పట్టుకుందన్నారు. 29 శాతం ఫిట్ మెంట్ పేరిట ఉద్యోగులను మరోమారు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఇచ్చిన ప్రకటన అధికారికం కాదని, ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేయడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదని విమర్శించారు. ఉద్యోగులు ఆత్మ ప్రబోధంతో ఓటేయాలని కోరారు. కోదండరాం ప్రొఫెసర్‌గా ఓయూలో పనిచేసి జీవితకాలం హైదరాబాద్‌లో ఉండి హైదరాబాద్‌లో పోటీ చేయకుండా నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడంపై అనుమానం కలుగుతోందన్నారు.
కేసీఆర్ ఆస్తి.. తెలంగాణ బడ్జెటంత: కోమటిరెడ్డి
సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘ నేతలంతా అమ్ముడుపోయారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. సొంత అవసరాలు తప్ప వారు ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదన్నారు. సంఘ నాయకుల మాటలు నమ్మకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఆయన ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ వచ్చాక ఈ ఏడేళ్లలో వీసీని నియమించలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ఆస్తి తెలంగాణ బడ్జెట్ అంతస్థాయికి పెరిగిందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయక్ పాల్గొన్నారు.