పత్తి బుగ్గి
- కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం
- సుమారు రూ.5 కోట్ల ఆస్తి నష్టం..
పూడూరు మండలం అజయ్‌బాగ్ సమీపంలోని సాయిబాబా అగ్రిటెక్ కాటన్ మిల్లులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లు ఆవరణలో ఆరబెట్టిన పత్తిని ట్రాక్టర్ డోజర్‌తో ఒక్కచోటకు పోగు చేస్తుండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి.
కాసేపటికే మంటలు మిల్లు ఆవరణ మొత్తం వ్యాపించి 9,100 క్వింటాళ్ల పత్తి కాలిబూడిదైంది.
- పూడూరు
పూడూరు: ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో కాటన్‌మిల్లులో అగ్ని ప్రమాదం జరిగి రూ. 5 కోట్ల ఆస్తినష్టం సంభవించింది. ఈ సంఘటన బుధవారం ఉదయం పూడూరు మండల పరిధిలోని అజయ్‌బాగ్ సమీపంలో ఉన్న సాయిబాబా అగ్రిటెక్ కాటన్ మిల్లులో చోటుచేసుకుంది. స్థానికులు, మిల్లు మేనేజర్ సంజయ్‌కుమార్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాటన్ మిల్లులో విడిగా ఉన్న పత్తిని ట్రాక్టర్ డోజర్ ద్వారా సిమెంట్ బెడ్‌పై కుప్పగా చేస్తున్నారు. ఈక్రమంలో సిమెంట్ బెడ్,ట్రాక్టర్ డోజర్‌కు ఉన్న ఇనుప పరికరం వలన రాపిడీ జరిగి నిప్పురవ్వలు రావడంతో పత్తికి అంటుకొని మంటలు చెలరేగాయి.
అంతలోనే సిబ్బంది అప్రమత్తమయ్యేసరికి దట్టంగా పొగ కమ్మేసింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది వెంటనే కంపెనీలో ఉన్న ఫైర్‌సిస్టమ్‌ను ఆన్ చేయగా అది పనిచేయలేదు. దీంతో ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చారు. గంట వరకు కూడా ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో దాదాపు రూ. 5 కోట్లకు పైగా విలువ చేసే పత్తి కాలిపోయింది. అనంతరం అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. వికారాబాద్, చేవెళ్ల, పరిగి నుంచి మూడు ఫైర్ ఇంజన్లు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మిగతా పత్తి పూర్తిగా తడిచిపోయింది. కాగా, పక్కనే సీసీఐ అధికారులు కొనుగోలు చేసిన 2747 క్వింటాళ్ల పత్తికి ఎలాంటి ప్రమాదం వాటి ళ్లలేదు. రెండు వేల క్వింటాళ్ల పత్తిగింజలు,700 దూదిబేళ్లకు ఎలాంటి నష్టం జరగలేదు. కాగా, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని చేవెళ్ల సీఐ ఉపేందర్ పరిశీలించారు. కంపెనీలో ఉన్న ఫైర్ సిస్టం పని చేసి ఉంటే నష్టం తగ్గేదని తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.