రిక్షాలో వచ్చిన సీఈవో.. సీఎం విస్మయం!
ట్రాఫిక్ విషయంలో దేశంలో ఏ నగరానికీ పెద్దగా మినహాయింపు లేదు. ఇక లక్నో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ నిత్యకృత్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకుంటూనే ఉంటాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను కలిసేందుకు బయలుదేరిన పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కూడా ఇలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక ముందుకు కదిలే గత్యంతరం లేకపోవడంతో.. ఓ రిక్షాకార్మికుడు ఆపద్బాంధవుడిలా ఆయనను ఆదుకున్నారు.
భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ఆయనను తన రిక్షాలో ఎక్కించుకొని.. చకచకా తొక్కుతూ ఏకంగా సీఎం నివాసం 5 కాళిదాస్ మార్గ్‌కు తీసుకెళ్లారు. దేశంలోనే టాప్ మొబైల్ వ్యాలెట్ స్టార్టప్ అధినేత ఇలా రిక్షాలో రావడంతో సీఎం అఖిలేశ్ ఒకింత విస్తుపోయారు. దీంతో తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘నగరంలోని ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్ సీఈవో విజయ్ రిక్షా సైకిల్లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.
రిక్షావాలా జిందాబాద్!
పీటీఎం సీఈవోను తన రిక్షాలో కూర్చోబెట్టుకొని సీఎం నివాసానికి తీసుకొచ్చిన మణిరామ్‌కు ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చింది. ఇందుకుగాను అతనికి రూ. 6వేల రివార్డుతోపాటు కొత్త రిక్షా సైకిల్, కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని సీఎం అఖిలేశ్ హామీ ఇచ్చారు. ఇక, రిక్షా సవారీ చేసిన పీటీఎం అధినేత విజయ్.. ఆ కార్మికుడికి నేరుగా డబ్బు ఇచ్చారా? లేక పేటీఎం ద్వారా ఈ-పేమెంట్ చేశారా? అని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.