తప్పతాగి డ్రైవింగ్
ఆల్కాట్ తోట (రాజమండ్రి),న్యూస్‌లైన్ :స్కూలు పిల్లలను విశాఖపట్నం నుంచి గుంటూరుకు తీసుకువెళుతున్న ఒక ప్రైవేటు బస్సు డ్రైవరు మద్యం సేవించి బస్సు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాల్లో అనేకమంది చనిపోతున్నప్పటికీ ట్రావెల్స్ యజమానులు నిబంధనలు పాటించడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనం. విశాఖపట్నంకు చెందిన విజ్ఞాన్స్కూల్తోపాటు వివిధ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు, ఎనిమిదిమంది ఉపాధ్యాయులతో గుంటూరులో జరిగే విజ్ఞానోత్సవ్ కార్యక్రమానికి జయశ్రీట్రావెల్స్కు చెందిన బస్సును బుక్ చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరిన బస్సును రాత్రి 09.30 గంటల సమయంలో రాజమండ్రి కోటిపలి ్లబస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిబ్బంది ఆపారు. బ్రీత్ఎనలైజర్ ద్వారా బస్సుడ్రైవర్ వై.అప్పారావు మద్యం సేవించినట్టు గుర్తించారు. బస్సును నిలుపుదల చేసి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఈ డ్రైవరు స్థానంలో మరొకరిని పంపించాలని ట్రావెల్స్ యజమానికి తెలియజేశారు. ఈమేరకు డ్రైవరుపై డ్రంకన్‌డ్రైవ్ కేసు నమోదు చేసి, బస్సు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదం తప్పినట్టే
మద్యం సేవించి బస్సు నడపడం వల్ల జరగరానిది జరిగితే స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెబుతారని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం కనీసం నియమ నిబంధనలు పాటించకపోవడం దారుణమన్నారు. పోలీసులు బస్సును నిలుపుదల చేయడంతో విద్యార్థులు ఏమి జరిగిందోనంటూ ఆందోళనకు గురయ్యారు. బుధవారం గుంటూరులో జరిగే వివిధ పోటీల్లో పాల్గొనాల్సి ఉండడంతో బస్సు ఎప్పుడు క దులుతోందని టెన్షన్ పడ్డారు.