డ్రగ్స్ కేసులో ఎయిర్‌ఫోర్స్ కమాండర్ అరెస్టు
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల ముఠాకు సహకరించిన ఎయిర్‌ఫోర్స్ అధికారి జి.రాజశేఖర్‌రెడ్డిని నార్కొటిక్ బ్యూరో అధికారులు బుధవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మూతపడిన పరిశ్రమల్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను మంగళవారం నార్కొటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి డ్రగ్స్ ముఠాకు సహకరించినట్లు విచారణలో తేలడంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
రూ.10 లక్షలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. డబ్బుకు ఆశపడి ముఠాకు సహకరిం చానని రాజశేఖర్ ఒప్పుకున్నట్లు కోర్టులో రిపోర్టు దాఖలు చేశారు. చిన్ననాటి స్నేహితుడు శాస్త్రవేత్త వెంకటరామారావు వల్లే డ్రగ్స్ రవాణాకు సహకరించానన్నారు. రాజశేఖర్‌కు హైదరాబాద్‌తో పాటు పలుచోట్ల స్థిరాస్తులున్నట్లు నార్కొటిక్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు ముఠాసభ్యులను బెంగళూరులో అరెస్టు చేశారు.