Treasury officials
-
వేతనాల కోసం ఎదురుచూపులు
♦ విద్యా వలంటీర్లకు ఐదు నెలలుగా అందని జీతాలు ♦ గౌరవ వేతనమిచ్చే పద్దులో తేడాలున్నాయంటూ ట్రెజరీ కొర్రీ ♦ రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం: పాఠశాల విద్యా డెరైక్టర్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వలంటీర్లకు ఐదు నెలలుగా వేతనాలు కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. విద్యావలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7,974 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, ఆయా పోస్టులను ప్రభుత్వం విద్యా వలంటీర్లతో గత సెప్టెంబర్‌లో భర్తీ చేసిన విషయం విదితమే. వీరికి నెలకు రూ.8 వేల చొప్పున వేతనమిచ్చేలా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరంలో ఏడు నెలలు మాత్రమే పనిచేసే తమకు గత ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడం పట్ల పలువురు విద్యా వలంటీర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిలాల్లో పూర్తిగానూ, మిగిలిన జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వేతనాలు అందకపోవడంపై విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని వలంటీర్లు ఆరోపిస్తున్నారు. సదరు జిల్లాల్లో బిల్లులు పాస్ చేయకుండా ట్రెజరీ అధికారులు కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం విద్యావలంటీర్లకు గౌరవ వేతనమిచ్చే పద్దులో కాకుండా వేరే పద్దులో నిధులు విడుదల చేయడం వలన సమస్యలు ఉత్పన్నమయ్యాయని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. తప్పులను సరిచేయడంలో విద్యాశాఖ అధికారులు స్పందించకపోతుండడమే వేతనాల విడుదలలో జాప్యానికి కారణమంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్యా డెరైక్టర్‌ను వివరణ కోరగా, విద్యావలంటీర్లకు వేతనాలు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. -
లంచాలపైనే గురి..ట్రెజరీ..
- పీఆర్సీ ఆమోదానికి అక్రమ వసూళ్లు - వేతన సవరణ కోసం భారీగా డిమాండ్ - జిల్లాలోని 18 సబ్ ట్రెజరీల్లో ఇదే పరిస్థితి - మామూళ్లు రూ.5కోట్లు! విజయవాడ : జిల్లాలో ట్రెజరీ అధికారులకు పండగొచ్చింది. ఉద్యోగులకు ప్రభుత్వం 43శాతం పీఆర్సీ ప్రకటించడంతో బిల్లుల పాస్ కోసం వారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొత్త పేస్కేల్ ద్వారా జీతాల బిల్లు తయారుచేసేందుకు భారీగానే దండుకుంటున్నారు. దీంతో జిల్లాలోని 56 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, చివరకు అధికారులు కూడా వేతన సవరణ కోసం ట్రెజరీ అధికారులు, సిబ్బందికి లంచాలు ముట్టజెబుతున్నారు. పీఆర్సీ ఇలా ఆమోదిస్తారు ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేతన సవరణ కోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సంబంధిత కార్యాలయాల నుంచి ట్రెజరీలకు తమ జీతాల వివరాలు తెలియజేయాలి. డీఏ, హెచ్ఆర్ఏ, బేసిక్‌పే.. వివరాలు ఒక ఫార్మాట్లో పెట్టి ట్రెజరీ అధికారికి పంపి ఆమోదం పొందాలి. వారు ప్రస్తుతం పొందుతున్న డీఏను బేసిక్‌పేతో కలిపి దాన్ని కొత్త బేసిక్పేగా చూపిస్తారు. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ కలిపి పీఆర్సీని నిర్ణయిస్తారు. ఇందుకు డ్రాయింగ్ ఆఫీసర్ ఇచ్చిన కొత్త వేతన సవరణ ప్రతిపాదనలపై సంబంధిత ట్రెజరి ఉద్యోగి, అధికారి ఆమోదం తెలియజేయాలి. ఒక్కో బిల్లుకు రూ.వెయ్యి డిమాండ్ జిల్లాలో 56 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 50వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేల్స్ కోసం ట్రెజరీ అధికారులకు ప్రతిపాదనలు ఇస్తున్నారు. దీంతో ఒక్కో జీతం బిల్లుకు ట్రెజరీ అధికారులు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 18 ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కొత్త పీఆర్సీ పుణ్యమా అని సుమారు రూ.5కోట్ల మూమూళ్లు అందుతున్నాయని తెలుస్తోంది. విజయవాడ, మచిలీపట్నంతో పాటు అన్ని మండల కేంద్రాల ట్రెజరీల్లో సంబంధిత కార్యాలయాల వేతనాలు డ్రాచేసే సిబ్బంది.. ఉద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి అధికారులకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. -
ఇదేం ‘తీరు.. వా..!’
పిఠాపురం : రైతుల నుంచి వసూలు చేసే నీటితీరువాలో పంచాయతీలకు కేటాయించాల్సిన వాటాను జమ చేసే తీరు అవినీతిమయంగా మారింది. సొమ్ములు చేతులు మారందే పంచాయతీలకు నిధులు రావడంలేదు. పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్న కొందరు తమ పంచాయతీల ఖాతాల్లోకి నీటితీరువా వాటాను జమ చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2006 నుంచి సుమారు రూ.6.50 కోట్ల నీటితీరువా వాటా పంచాయతీలకు జమ కావాల్సి ఉన్నట్టు అంచనా. ఏటా రైతుల నుంచి సార్వాకు రూ.200, దాళ్వాకు రూ.150 నీటితీరువా వసూలు చేస్తూంటారు. ఇందులో 10 శాతం నీటిసంఘాలకు, ఐదు శాతం పంచాయతీల అభివృద్ధికి కేటాయించాలి. రెవెన్యూ అధికారులు నీటితీరువా వసూలు చేసి, ట్రెజరీల్లో జమ చేస్తారు. అనంతరం ఆ ఏడాది పంచాయతీల కు చెల్లించాల్సిన మొత్తం వివరాలను ఆరు నెలలకోసారి బ్యాంకులు, ట్రెజరీలకు అందజేయలి. వాటి ఆధారంగా ఆ నిధుల్ని ట్రెజరీ అధికారులు ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ ప్రస్తుతం ఈ విధానం అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదు. నీటిసంఘాలకు సక్రమంగానే నిధులు అందుతున్నా.. ఏళ్ల తరబడి పంచాయతీలకు అందడం లేదు. ఐదు శాతం నీటితీరువా నిధులతో పంచాయతీ అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాల్లో ఎనిమిదేళ్లుగా, కొన్నిచోట్ల మూడేళ్లుగా నీటితీరువా వాటా పంచాయతీలకు జమ కావడంలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని సర్పంచులు వాపోతున్నారు. జిల్లాలో 1012 గ్రామ పంచాయతీలుండగా వీటిలో 224 మేజర్, 788 మైనర్ ఉన్నాయి. పంచాయతీల పరిధి లో ఉన్న భూములనుబట్టి ఒక్కో పంచాయతీకి ఏటా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నీటితీరువా వాటా వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మైనర్ పంచాయతీకి సుమారు రూ.4 లక్షలు, మేజర్ పంచాయితీకి రూ.12 లక్షల వరకూ బకాయిలున్నాయి. వీటికోసం కొందరు సర్పంచ్‌లు రెవె న్యూ, ట్రెజరీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అధికారులు క్రమపద్ధతిలో జమ చేయాల్సి ఉన్నా సర్పంచ్ల నుంచి మామూళ్లు ఆశించి, జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని మండలాల్లో సర్పంచ్‌లంతా కొంత సొమ్ము వసూలు చేసి, వాటిని అధికారులకు ముట్టజెప్పడం ద్వారా నీటితీరువా వాటా సాధిస్తున్నట్టు సమాచారం. కొంతమంది సర్పంచ్‌లకు అసలు నీటితీరువా అంటేనే తెలియని దుస్థితి కనిపిస్తోంది. -
ట్రెజరీ కథలో కొత్తకోణం
చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో రూ.కోట్ల కుంభకోణం కథ మరో మలుపు తిరుగుతుంది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్‌సీల రికార్డులను ఆఘమేఘాల మీద సంబంధిత అధికారులు ట్రెజరీ కథలో కొత్తకోణం విశాఖపట్నం తరలించారు. ఈ కుంభకోణంలో ఆరోగ్యశాఖ నిగ్గు తేల్చేందుకు విచారణ అధికారిగా జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారిని నియమించినట్టు తెలిసింది.చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల ఉద్యోగుల జీతాల చెల్లింపు, వివిధ రకాల బిల్లుల లావాదేవీలు జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో లేని ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్ల పక్కదారి పట్టించిన సంగతి తెలిసిందే. ట్రెజరీలో అకౌంటెంట్ అప్పలరాజు కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట జరిగిన చెల్లింపుల్లో ఒకేరోజు తన వ్యక్తిగత ఖాతాలో రూ.17 లక్షలు జమ చేసుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అవినీతి కుంభకోణానికి అప్పలరాజును ప్రధాన బాధ్యునిగా చేస్తూ ట్రెజరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశాఖలో లేని ఉద్యోగులకు బడ్జెట్ కేటాయింపులు ఎలా జరిగాయన్న కోణంలో ఆలోచిస్తే ఆ శాఖ పెద్దల హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో కోరుకొండ, తాజంగి, జర్రెల, సప్పర్ల, పెదవలస, దారకొండ, కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం పీహెచ్సీలలో పని చేసిన వైద్యాధికారులు, గుమస్తాలు బోగస్ కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెలుగు చూసింది. నకిలీ ఉద్యోగుల సృష్టిలో తమ పాత్రేమీ లేదంటూ వైద్యాధికారులు గగ్గోలు పెడుతున్నారు. కాగా రికార్లుల్లో వైద్యాధికారులు తెలిసే సంతకాలు చేశారా? లేక కిందిస్థాయి సిబ్బంది పోర్జరీ సంతకాలతో ఈ అవినీతికి పాల్పడ్డారా? అనే దానిపై కూడా లోతుగా విచారిస్తున్నారు. నకిలీ ఉద్యోగుల సృష్టి మాట అంటుంచితే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గుడ్డిగా బడ్జెట్‌ను ఎలా కేటాయించారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు ఉందో వెలుగు చూడాలంటే పూర్తిస్థాయి విచారణ తెలపాలని పలువురు కోరుతున్నారు. -
నేటితో ఖజానా చెల్లింపులకు బ్రేక్
- ప్రభుత్వ ఆదేశాలు జారీ విభజన నేపథ్యంలో చెల్లింపులపై కొరవడిన స్పష్టత - పింఛన్ల పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు అభివృద్ధి పనుల బిల్లుల మంజూరుకు ఆటంకాలు సాక్షి, గుంటూరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా శాఖ నుంచి చెల్లింపులకు నేటితో బ్రేకులు పడనున్నాయి. శనివారం సాయంత్రం తర్వాత ఎలాంటి బిల్లులకు చెల్లింపులు జరపరాదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉద్యోగులకు జీతాలు, డీఏలు, పెన్షన్‌దారులకు పింఛన్లు ముందస్తుగానే చెల్లించేందుకు ట్రెజరీ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం గడువు కావడంతో ట్రెజరీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. ఉద్యోగులు,పన్షన్‌దారులకు చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల మంజూరుకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 19 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. రోడ్లు, మంచినీటి పథకాలు, గోడౌన్లు, స్త్రీ శక్తి భవనాలు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు తదితరాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్, హాస్టల్ డైట్స్‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ 2 రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేట్ కావడంతో ఆ తర్వాతైనా బిల్లుల చెల్లింపులు చేస్తారా అన్న అంశంపై ఖజానా అధికారులకు స్పష్టత లేదు. ఆర్నెల్ల నుంచి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమైంది. అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఈ సమయంలో ట్రెజరీ నుంచి విడుదల కావాల్సిన నిధులు అందకపోవడంతో జిల్లాలో ముఖ్యంగా తాగునీటికి సమస్యలు ఏర్పడనున్నాయి. ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్ల చెల్లింపులు.. జిల్లాలో ప్రతి నెలా ట్రెజరీ ద్వారా రూ.536 కోట్లు చెల్లింపులు జరుగుతున్నాయి. రూ.236 కోట్లు ట్రెజరీకి ఆదాయం జమ అవుతోంది. జిల్లాలో 42 వేల మంది ప్రభుత్వోద్యోగులు, 40 వేల మంది పెన్షన్‌దారులున్నాయి. వీరికి ప్రతి నెలా రూ.252 కోట్ల మేర జీతాలు, డీఏ, పింఛన్లు చెల్లింపులు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రంతో ఖజానాకు తాళం పడనుండటంతో ట్రెజరీ అధికారులు బిజీగా మారారు. జూన్ 2 తర్వాత యథావిధిగా చెల్లింపులు జరిపేందుకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు.