మలేరియాతో గిరిజన యువతి మృతి
రాజవొమ్మంగి (రంపచోడవరం) : రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకు చెందిన నేశం శిరీష (22) అనే గిరిజన యువతి మలేరియా జ్వరం, కామెర్లతో ఏలేశ్వరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఆమెకు ఏడాది కిందటే వివాహం జరగ్గా అమ్మగారి ఊరైన అమీనాబాద్ వచ్చి జ్వరం బారిన పడింది. దీంతో కుటుంబీకులు ఆమెను రెండు రోజుల కిందట ఏలేశ్వరం తరలించారు.
అక్కడ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష పరిస్థితి విషమించి చివరికి మరణించింది. రెండు రోజుల కిందట అమీనాబాద్కాలనీకే చెందిన రావుల రాంబాబు (40) అనే గిరిజనుడు ఏలేశ్వరం ప్రయివేటు ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొంది, చనిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే. అమీనాబాద్కాలనీకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గల జడ్డంగి పీహెచ్సీకి వెళ్ళకుండా గిరిజనులు వైద్యం కోసం ఏలేశ్వరంలోని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించడం గమనార్హం. జడ్డంగి పీహెచ్సీలో సరైన వైద్యం అందక, క్షేత్రస్థాయి మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధికారులు పనితీరు సంతృప్తికరంగా లేకే ఇక్కడి గిరిజనులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రోగనిర్ధారణలో జాప్యంతో చేటు..
కేవలం జ్వరంతో మూడు రోజుల పాటు బాధపడుతూ గిరిజనులు చనిపోవడానికి అసలు వారికి వచ్చిన రోగం ఏమిటన్నది త్వరగా నిర్ధారణ కాకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డెంగీ వంటి రోగాల బారిన పడి సకాలంలో సరైన వైద్యం లభించకే గిరిజనుల్లో మరణాలు సంభవిస్తున్నాయా అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది. రోగంతో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్ళి ఫీజుల రూపేణా వేలకు వేలు చెల్లించలేని స్థితిలో చికిత్సకు నోచుకోక కూడా ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోతున్నారా అన్న అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.