అశనిపాతం
కర్ణాటకకు వ్యతిరేకంగా మహదాయి ట్రిబ్యునల్ తీర్పు
బెళగావి, గదగ్ ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనలు
నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన కన్నడ సంఘాలు
న్యాయవాదులతో చర్చించి తదుపరి నిర్ణయం: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: మహదాయి నదీ జలాల వివాదానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర అర్జీని మహదాయి నదీజలాల ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెళగావి, గదగ్‌లోని నరగుంద తదితర ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. మహదాయి నది నుంచి మలప్రభకు ఎత్తిపోతల ద్వారా 7.56 టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం ట్రిబ్యునల్ ఎదుట మధ్యంతర అర్జీని దాఖలు చేసింది. కర్ణాటక తరఫున ప్రముఖ న్యాయవాది ఫాలి నారీమన్ వాదనలు వినిపించగా, గోవా తరఫున ఆత్మారామ్ నాడికర్ణి ఆ రాష్ట్ర వాదనలను వినిపించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ తన మధ్యంతర తీర్పును బుధవారం వెలువరించింది. 7.56టీఎంసీల నీటిని కోరుతూ కర్ణాటక దాఖలు చేసిన మధ్యంతర అర్జీని ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ ప్రాంతంలోని ప్రజలు తాగునీటి అవసరాల కోసం మహదాయి నదీ జలాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా ఈ అంశంపై పోరాటం సాగిస్తున్నారు.
తీర్పు విషయం తెలిసిన వెంటనే బెళగావి, గదగ్ జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. వివిధ రైతు సంఘాలు, కన్నడ సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. గదగ్‌లోని ఎంపీ శివకుమార ఉదాసీ కార్యాలయంపై నిరసన కారులు దాడికి పాల్పడ్డారు. ఎంపీ కార్యాలయం వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌ను విరిచేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇక బైలహొంగళ నగరంలో కళసా-బండూరి పోరాట సమితి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీని నిర్వహించి నిరసనను తెలియజేశారు. బెళగావిలోని అనేక ప్రాంతాల్లో సైతం రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు టైర్లకు నిప్పుపెట్టి, ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే సందర్భంలో వివిధ కన్నడ సంఘాలు నేడు(గురువారం) కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి.
న్యాయవాదులతో చర్చించి తదుపరి నిర్ణయం......
మహదాయి నదీజలాల ట్రిబ్యునల్ తీర్పుపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మేము శాయశక్తులా ప్రయత్నించాం. అఖిల పక్ష సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సైతం భేటీ అయి విషయాన్ని వివరించాం, అయినా ఫలితం లేకుండా పోయింది. ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర తీర్పునకు సంబంధించిన ప్రతులు ఇంకా మాకు అందలేదు. ట్రిబ్యునల్ తీర్పు ప్రతి కోసం రాష్ట్ర న్యాయవాదులు ఇప్పటికే అర్జీ దాఖలు చేశారు. తీర్పు ప్రతి అందిన తర్వాత న్యాయవాదులతో చర్చించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాము. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం’ అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
30న కన్నడ చలనచిత్రసీమ బంద్
మహదాయి నదీజలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ తీర్పు కర్ణాటకకు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో ఈనెల 30న కన్నడ చలనచిత్ర సీమ బంద్ పాటించనుందని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సా.రా.గోవిందు వెల్లడించారు. కర్ణాటకకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ బంద్‌ను పాటించనున్నట్లు చెప్పారు. ఇదే సందర్భంలో కన్నడ సంఘాల ఒక్కూట నేతృత్వంలో ఈనెల 30న కర్ణాటక బంద్ పాటించనున్నట్లు ఒక్కూట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ తెలిపారు. గురువారం నుంచే తమ నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. గురువారం రోజున గోవా, మహారాష్ట్ర సీఎంల దిష్టిబొమ్మలను తగల బెట్టడం ద్వారా తమ పోరాటాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తీర్పునకు వ్యతిరేకంగా ధర్నా
తుమకూరు: మహదాయి నదీ జలాలపై కర్ణాటకకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో తుమకూరు నగరంలోని టౌన్‌హాల్ సర్కిల్లో బుధవారం రైతు సంఘం నేత కోడి హళ్ళి చంద్రశేఖర్ నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు. టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.