దొంగలు దొరికారు
ఔరంగాబాద్‌లో చోరీ.. హైదరాబాద్‌లో పట్టివేత
- టీవీల లోడ్ కంటైనర్ అపహరణ
- ఐదు నెలల క్రితం ఘటన
- ఛేదించిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- నలుగురి అరెస్టు: రూ. 30 లక్షల సొత్తు స్వాధీనం
హైదరాబాద్: ఐదు నెలల క్రితం ఔరంగాబాద్‌లో జరిగిన భారీ చోరీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.30 లక్షల విలువైన 216 ఎల్ సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఐదు నెలల క్రితం ఔరంగాబాద్‌లోని ఒనిడా టీవీ తయారీ కంపెనీ నుంచి టీవీలు లోడ్‌తో ఉన్న భారీ కంటైనర్ (లారీ) చోరీకి గురైంది. శనివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి, నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... ఔరంగాబాద్‌లోని క్రాంతిచౌక్ ప్రాంతంలో ఒనిడా టీవీ తయారీ కంపెనీ ఉంది.
ఈ కంపెనీ నుంచి సూరత్‌లోని టీవీ షో రూమ్‌లకు తరలించేందుకు గతేడాది సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి 10 గంటలకు భారీ కంటైనర్‌లో 417 టీవీలను లోడ్ చేశారు. డ్రైవర్ కంటైనర్‌ను కంపెనీ గేటు బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న దాబా వద్ద భోజనం చేసేందుకు నిలిపాడు. భోజనం ముగిశాక ఉదయం లేచి సూరత్‌కు వెళ్దామనుకొని డ్రైవర్ అదే దాబాలో పడుకున్నాడు. ఇదే అదనుగా భావించిన హైదరాబాద్ బహుదూర్పురాలోని తాడ్బంద్లో స్కాప్ వ్యాపారం నిర్వహిస్తున్న ఔరంగాబాద్‌కు చెందిన షేక్ హుమాయూన్(49) ఆ టీవీ లోడ్‌తో ఉన్న భారీ లారీని తస్కరించి నగరానికి తీసుకొచ్చాడు.
లోడ్‌తో ఉన్న ఆ కంటైనర్‌ను ఫలక్‌నుమాకు చెందిన వస్త్ర వ్యాపారి, తన బంధువు సయ్యద్ వాసిమ్(28), ఫలక్‌నుమాకు చెందిన విద్యార్థి ఎంఏ అలీఖాన్(23)లకు అప్పగించాడు. అందులోని టీవీలను విక్రయించేందుకు ఈ ముగ్గురు కలిసి బండ్లగూడకు చెందిన టీవీ మెకానిక్ మహ్మద్ ఇద్రీస్ (32)ను సంప్రదించారు. అతని సహకారంతో ‘హుమాయిన్ ఎలక్ట్రానిక్స్’ పేరుతో నకిలీ బిల్లులు తయారు చేశారు. ఈ బిల్లుల సహాయంతో నగరంలో వివిధ షాపులలో 173 టీవీలను విక్రయించారు. వచ్చిన డబ్బులో రూ.4.5 లక్షలు హుమాయూన్కు ఇచ్చారు. మరో రూ.27 లక్షలు తర్వాత ఇస్తామని అలీఖాన్, ఇద్రీస్‌లు హుమాయున్‌తో నమ్మబలికారు. మిగిలిన 244 టీవీలను ఔరంగాబాద్‌కు చెందిన అమీర్, కర్ణాటకకు చెందిన షేరులకు విక్రయించారు.
ఇలా పట్టుబడ్డారు...
టీవీల లోడ్ కంటైనర్ చోరీపై ఒనిడా కంపెనీ యాజమాన్యం ఔరంగాబాద్‌లోని క్రాంతిచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అక్కడి ఎస్ఐ సిద్దిక్ విచారణలో కంటైనర్ హైదరాబాద్‌కు బయలుదేరిందని తేలడంతో అక్కడి అధికారులు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
నగరంలోని టీవీ షాపులలో ఒనిడా టీవీలు విక్రయించిన విషయాన్ని పసిగట్డంతో హుమాయున్ గుట్టు రట్టైంది. నిందితులు షేక్ హుమాయూన్, సయ్యద్ వాసిం అక్రం, ఎం అలీఖాన్, మహ్మద్ ఇద్రీస్లను అరెస్టు చేసి వారి నుంచి ఒనిడా కంపెనీకి చెందిన 50, 24, 20 అంగుళాల 216 టీవీలు, 4 సెల్ఫోన్లు, 2 కంప్రెషర్స్ స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ ఆచూకీ మాత్రం ఇంకా దొరలేదు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఔరంగాబాద్ పోలీసులకు బదిలీ చేసి, నిందితులను అప్పగించారు. మిగిలిన టీవీలు పరారీలో ఉన అమీర్, షేరు నుంచి రావాల్సి ఉంది.
షోరూమ్‌లా మారిన టాస్క్‌ఫోర్స్ ఆఫీస్
టాస్క్‌ఫోర్స్ పోలీసులను నిందితులను అదుపులోకి తీసుకుని టీవీలను స్వాధీనం చేసుకుని వాటిని తమ కార్యాలయంలో పెట్టారు. బారులుగా ప్లాస్మా, ఎల్ఈడీ, ఇతర టీవీలను పెట్టడంతో కార్యాలయం టీవీ షోరూమ్‌లా మారిపోయింది. స్థలం లేకపోవడంతో కొని టీవీలను బయటే పెట్టారు.