ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోరాదా?
బెంగళూరు: సమాజంలో ఇప్పటికే ఎన్నో సమస్యలతో జీవన పోరాటం చేస్తున్న తమను మరింత ఇబ్బందికి గురిచేసేలా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం ప్రసార మాధ్యమాలకు తగదని ఎల్జీబీటీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అక్కాచెల్లెలి వరసయ్యే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని బుధవారం టీవీ చానెళ్లలో పదేపదే చూపించడం, పత్రికల్లో ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
గురువారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పలు లింగమార్పిడి, స్వలింగ సంపర్కుల హక్కుల (ఎల్జీబీటీ) సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.... జరిగిన సంఘటనను వక్రీకరించి ప్రసారం చేశారని విమర్శించారు. ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్నారనే సంగతిని ప్రసారం చేసేవారు, దీనివల్ల వారి వ్యక్తిగత జీవితానికి ఎంత నష్టం వాటిల్లుతుందనేది ఆలోచించకపోవటం శోచనీయమని ఆక్షేపించారు.
ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదా?
తమ గురించి ఈ విధంగా ప్రచారం జరగటంతో సమాజంలో ఎన్నో అవమానాలను, బాధలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. ఇద్దరు మహిళలు కలసి జీవించటం అనేది పెద్ద నేరం, ప్రపంచంలో ఎక్కడా జరుగలేదన్న విధంగా చేయటం విడ్డూరంగా ఉందన్నారు. వివాహమనేది వారి వ్యక్తిగత విషయమనే సంగతనేది మరువరాదన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఏమిటో చెప్పుకోవటానికి తమకు మాత్రమే హక్కు ఉంది, తాము ఫలానా అని ఇతరులు ప్రచారం చేయటం తప్పు అవుతుంది అని చెప్పారు. సమాజంలో తాము కూడా గౌరవంగా జీవించడానికి దోహదపడిన మీడియా తొలిసారిగా ఇబ్బందికి గురిచేసేలా వ్యవహరించిందని అన్నారు. ఆ ఇద్దరు మహిళల సంగతిని పోలీసులు మీడియాకు తెలియజేయటం కూడా సరైన విధానం కాదని వారు ఖాకీలనూ తప్పుబట్టారు.
అక్క చెల్లెళ్ల ప్రేమపెళ్లి.. సహజీవనం