లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి
వర్ధన్నపేట టౌన్ : అతివేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. వర్ధన్నపేట ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శివరాత్రి కొమురయ్య(60) తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకోవడానికి ఇంటి నుంచి బయల్దేరాడు. అంబేద్కర్ సెంటర్ సమీపంలో వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిని దాటుతున్న క్రమంలో కోదాడ నుంచి సిమెంట్ లోడుతో వరంగల్ వైపునకు వెళుతున్న లారీ అతివేగంగా వస్తూ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కూతు రు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.