లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం
మదనపల్లె రూరల్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో శుక్రవారం ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. పట్టణంలోని సంజీవరాయుని ఆస్పత్రి వీధిలో ఉంటున్న వ్యాపారి మావిళ్ల శేఖర్ప్రసాద్రెడ్డి, సుభాషిణి దంపతుల కుమారుడు తేజారెడ్డి(21) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. అతని తమ్ముడు చందూరెడ్డి(18) ఇంటి వద్దే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీరిద్దరూ శుక్రవారం పుంగనూరు మండలం ఈడిగపల్లెలో బంధువుల గృహ ప్రవేశానికి మదనపల్లె నుంచి ద్విచక్ర వాహనంలో బయల్దేరి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో వలసపల్లె సమీపంలో మదనపల్లె నుంచి వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తేజారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చందూరెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బిడ్డ మరణవార్త తెలియగానే ఆసుపత్రికి వచ్చిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.