తైవాన్‌కు అప్పుడే దడపుట్టిస్తున్న 'మెగి'
తైవాన్: తైవాన్ను మరోసారి టైఫూన్ చుట్టేస్తోంది. రెండు వారాల్లో మూడోసారి దాడి చేయనుంది. ఈ భయంతో వేలమంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వందల్లో కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతానికి శరవేగంతో దూసుకొస్తున్న తైపూన్'మెగి' రేపు సరిగ్గా తైవాన్ తీరాన్ని తాకనుంది. దీరి ప్రభావంతో ఇప్పటికే బలమైన గాలులు వీస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. ఐలాండ్ కు సమీపంగా మెగి వచ్చిన నేపథ్యంలో దాదాపు ధ్వంసం చేసేంత ప్రభావాన్ని చూపిస్తోంది. అధికారులంతా అప్రమత్తమయ్యారు.
ముందస్తు జాగ్రత్తగా 5వేలమంది ప్రజలు తీర ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తైవాన్ కేంద్ర అత్యవసర సేవల నిర్వహణా సంస్థ తెలిపింది. టైఫూన్ కారణంగా 36 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 575 అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను నిలిపేసినట్లు చెప్పారు. మరో 109 విమానాల సర్వీసులు ఆలస్యం అవుతాయన్నారు. ప్రస్తుతం భీకరగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే వేలమంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు.