కీమోథెరపీ లేకుండా కేన్సర్ చికిత్స!
లండన్: కేన్సర్ చికిత్సలో బాధాకరమైన కీమోథెరపీకి ప్రత్నామ్నాయంగా చికిత్స అందించేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లుకేమియా చికిత్సలో వాడే రెండు రకాల మందులు కేన్సర్ చికిత్సకు ఎంతో ఉపయోగపడుతాయని చెబుతున్నారు. కేన్సర్ చివరి దశలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా వారు మరికొంత కాలం జీవించేలా ఇవి దోహదపడుతాయని పేర్కొంటున్నారు.
భవిష్యత్‌లో ఇవి కీమోథెరపీకి బదులుగానే కాకుండా మూలకణాల మార్పిడి ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. లింఫాటిక్ లుకేమియా చికిత్సలో వినియోగించే కైనేజ్ ఇన్హిబిటార్స్ తరగతికి చెందిన ఇబ్రుటినిబ్, ఇడిలాలిసిబ్ అనే రెండు డ్రగ్స్ ఈ మేరకు పనిచేస్తున్నాయని గుర్తించారు. ఈ చికిత్స తీసుకున్న వారి జీవిత కాలం ఒకటి నుంచి రెండేళ్లు పెరుగుతున్నట్లు, అందులో 80 శాతం మంది రెండేళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు డ్రగ్స్‌ను కలిపి వాడితే ఎలా ఉంటుందన్న అంశంపై పూర్తి స్థాయి పరీక్షలు ప్రారంభించినట్లు వియన్నా జనరల్ హాస్పిటల్‌కు చెందిన ఉల్రిచ్ జగర్ పేర్కొన్నారు.