'ప్లీజ్.. భారత్-పాక్ చర్చలకు రావాలి'
న్యూయార్క్: ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చించుకోవడానికి రావాల్సిందిగా భారత్, పాకిస్థాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. దక్షిణాసియా దేశాల్లో శాంతియుత పరిస్ధితులు ఉంటేనే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్పిన ఆయన చర్చలకే భారత్-పాక్ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఈ నెలాఖరులో బాన్ కీ మూన్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బాన్ కీ మూన్ తరుపున ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి ఫరాన్ హక్ ఈ ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో సరిహద్దు వద్ద మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అయినా ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చూసి చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఓ పాక్ జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హక్ స్పందిస్తూ మూన్ మాటలుగా పలు విషయాలు చెప్పారు. కశ్మీర్ విషయాన్ని పట్టించుకోవడం లేదనే మాటలు సరికాదని, తాము అన్నింటిని పరిశీలిస్తున్నామని, ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా చేస్తూనే ఉన్నామని తెలిపారు. పాక్- భారత్ దేశాల మధ్య చర్చలకు బాన్ కీ మూన్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.