ఐక్యరాజ్యసమితిపై ఇండియా ఫైర్
జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్‌పై నిషేధం విధించడంలో ఐక్యరాజ్యసమితి ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని, లేనిపోని రాజకీయాలు చేస్తోందని భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బ్లాక్‌లిస్టులో పెట్టినా, దాని అధినేత మసూద్ అజహర్ (48)ని మాత్రం ఇంకా నిషేధించలేదు. అజహర్‌ను నిషేధించాలంటూ భారతదేశం చేసిన ప్రతిపాదనను భద్రదతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా రెండుసార్లు అడ్డుకుంది. తమ దేశంలో ఈ ఏడాదే రెండుసార్లు జైషే మహ్మద్ సంస్థ దారుణమైన ఉగ్రదాడులకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపైన, తర్వాత సెప్టెంబర్‌లో ఉడీలోని సైనిక స్థావరంపైన ఉగ్రవాద దాడులు జరిగాయి. రెండు ఘటనల్లో కలిపి 26 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాద సంస్థల అధినేతలపై ఆంక్షలు విధించడంలో భద్రతామండలి ఘోరంగా విఫలం అవుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మండిపడ్డారు. భారతదేశంలోని ఏదో ఒక ప్రాంతంలో దాదాపు ప్రతిరోజూ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారని.. అలాంటి సంస్థల అధినేతలుగా తమను తాము ప్రకటించుకున్నవాళ్లపై నిషేధం విధించడానికి భద్రతామండలి ఇప్పటికే 9 నెలల సమయం తీసుకుందని ఆయన అన్నారు. మసూద్ అజహర్‌పై నిషేధం విధించకుండా తొలిసారి ఏప్రిల్ నెలలో వీటో చేసిన చైనా.. తర్వాత సెప్టెంబర్ నెలలో దాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. దాంతో భారత్ తీవ్రస్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.