uniform cloth
-
బడులు తెరిచే నాటికి అందుబాటులోకి..
ఆదిలాబాద్: రానున్న విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు యూనిఫాం అందించే దిశగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూనిఫాం కుట్టే బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించింది. ఆసక్తి, వృత్తి నైపుణ్యాలు కలిగిన సభ్యులను ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రస్తుతం విద్యార్థుల కొలతలను సేకరిస్తున్నారు. విద్యాశాఖ నుంచి వస్త్రం కొనుగోలు చేసి ఇచ్చిన వెంటనే దుస్తులు కుట్టే పనిని ప్రారంభించనున్నారు. అయితే కుట్టు కూలిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం వారిని కొంత ఆందోళనకు గురి చేస్తోంది. యునిఫామ్లంతా వేసవిలోనే కుట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్లొనే విద్యార్థులకు కొత్త దుస్తులు అందనున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 1,200 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 84,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బాలురు 42,082 మంది, బాలికలు 42,015 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందజేస్తుంది. ఇదివరకు వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో కుట్టించి విద్యార్థులకు అందించే వారు. పాఠశాల ప్రారంభమై నెలలు గడిచినా చాలా మందికి అందేవి కావు. పైగా గుత్తేదారు విద్యార్థుల కొలతలు తీసుకోకుండా కుట్టడంతో సైజ్ సరిపోక ఇబ్బందిగా మరేది. ఇలాంటి పరిస్థితిని దూరం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతలను ఎస్ హెచ్జీలకు అప్పగించింది. ఇందుకోసం అర్హులైన ఆసక్తి గల సభ్యులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కసరత్తు షురూ.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. కుట్టు నైపుణ్యాలతో పాటు మిషన్ కలిగి ఉన్న 1,807 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సంబంధించిన కొలతలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాల, తరగతుల వారీగా కొలతలు తీసుకుంటున్నారు. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి వాటిని ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందించనున్నారు. అవసరమైన వస్త్రం అందిన వెంటనే వేసవి సెలవుల్లో యూనిఫాం కుట్టే ప్రక్రియను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వస్త్రం రాగానే ఐకేపీ వారికి ఇస్తాం 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను కుట్టించే బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఐకేపీ సిబ్బంది విద్యార్థుల కొలతలు తీసుకుంటున్నారు. ఆప్కో నుంచి వస్త్రం వచ్చిన వెంటనే వారికి అప్పగిస్తాం. వారు కుట్టించి విద్యార్థులకు అందిస్తారు. – సుజాత్‌ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
యూ‘నో’ఫాం!
♦ ఇచ్చుడు వచ్చినప్పుడే.. ♦ అతీగతీ లేని యూనిఫాం క్లాత్ ♦ ఈ విద్యాసంవత్సరం ఆలస్యమే.. ♦ సకాలంలో ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు విద్య.. పాఠ్యపుస్తకాలు.. స్కూల్ డ్రస్.. మధ్యాహ్న భోజనం.. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సౌకర్యాలు. బడులు తెరిచే నాటికి దుస్తులు పిల్లలకు పంపిణీ చేస్తాం.. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి అంటూ బడిబాటలో ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేసిన ఉపాధ్యాయుల పరిస్థితి దుస్తుల జాడ లేకపోవడంతో కక్కలేక మింగలేకుండా ఉంది. యూనిఫాం క్లాత్‌ను సరఫరా చేసే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు గత విద్యాసంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆలస్యం చేస్తారా.. అసలు దుస్తులు వస్తాయా.. రావా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు యూనిఫాం విషయమై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి. అధికారులు మాత్రం ఇండెంట్ పెట్టాం.. ఎప్పుడొస్తే అప్పుడే పాఠశాలలకు పంపిస్తామని చెప్పడం గమనార్హం. - ఖమ్మం ఇండెంట్ పంపించాం.. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఇండెంట్ పంపించాం. ఈ విద్యాసంవత్సరం 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే 1,57,364 మంది విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయాల్సి ఉంది. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి క్లాత్ వచ్చిన వెంటనే యూనిఫాంలు త్వరగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. - రవికుమార్, ఎస్ఎస్ఏ పీఓ ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య తారతమ్య భావన లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందిస్తోంది. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి ఏడాదికి రెండు జతల చొప్పున అందించేందుకు రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఉచితంగా క్లాత్ సరఫరా చేస్తోంది. గతంలో ఆప్కో నుంచి క్లాత్ సరఫరా చేస్తే.. ఎమ్మార్సీల ద్వారా దానిని పాఠశాలలకు పంపించడం.. అక్కడ వాటిని కుట్టించి విద్యార్థులకు సరఫరా చేసేవారు. అయితే ఇలా చేయడం వల్ల జాప్యం జరుగుతుందని, నాణ్యత లోపిస్తుందని భావించిన ఎస్ఎస్ఏ(సర్వశిక్ష అభియాన్) అధికారులు దుస్తుల క్లాత్‌కు జతకు రూ.160, కుట్టుకూలి రూ.40 చొప్పున.. జతకు రూ.200.. రెండు జతలకు రూ.400 చొప్పున హెచ్ఎం అకౌంట్లలో వేసేవారు. కొన్ని ప్రాం తాల్లో ఇవి సక్రమంగా పంపిణీ కావడం లేదని, పలువురు డబ్బులు కాజేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో క్లాత్‌ను నేరుగా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి కుట్టించి ఇచ్చేవారు. అయితే గత విద్యాసంవత్సరం ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు దుస్తులు సరఫరా చేయలేదు. పంద్రాగస్టుకు కొత్త బట్టలు వేసుకుందామని భావించిన విద్యార్థులకు.. జవవరి 26 వరకు కూడా అందుబాటులోకి రాలేదనే విమర్శలు వచ్చాయి. ఈ‘సారీ’ ఆలస్యమే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు నానా తంటాలు పడుతున్న ఉపాధ్యాయులకు.. విద్యార్థులకు దుస్తులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. దుస్తులు ఎక్కడ కొనుగోలు చేయాలి.. ఎవరికి అప్పగించాలి.. అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా దుస్తుల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో అన్నీ ఉచితమే అని ఉపాధ్యాయులు చెప్పడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నామని, అయితే దుస్తులు ఇవ్వడం ఆలస్యం కావడంతో కొత్త బట్టలు కుట్టించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని, ఇప్పుడు వందలకు వందలు పెట్టి బట్టలు ఎలా కుట్టించాలని వాపోతున్నారు. ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి సరఫరా చేస్తే ఈ బాధ ఉండేది కాదని అంటున్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, దుస్తులు అందిస్తే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం. -
‘దర్జా’గా దోపిడీ..!
ఖమ్మం, న్యూస్‌లైన్: అక్రమాల పుట్టగా పేరున్న జిల్లా రాజీవ్ విద్యా మిషన్‌లో పనిచేస్తున్న అధికారులు చివరకు విద్యార్థులకు సరఫరా చేసే ఏకరూప దుస్తుల కుట్టుకూలిలోనూ కక్కుర్తి పడుతున్నారు. పొరుగు జిల్లాలోని పలు స్టిచ్చింగ్ ఏజెన్సీలతో కమీషన్ మాట్లాడుకొని జిల్లాలోని దర్జీల పొట్ట కొట్టేం దుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ‘మీతో కుట్టిస్తే మాకు ఏం ఇస్తారు?’ అని బహిరంగంగానే బేరసారాలు చేసుకుంటున్నట్లు ప్రచారం. ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు దర్జీలు, మహిళా గ్రూపుల నాయకులు అధికారులను నిలదీయగా, వారు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల మధ్య ఆర్థిక అంతరాలు బహిర్గతమైతే అది చిన్నారుల మనసుపై ప్రభావం పడుతుందని, విద్యార్థులకు కనీస వసతులు కల్పిస్తేనే పాఠశాలకు సక్రమంగా వస్తారని ప్రభుత్వం బావించింది. ఇందుకోసం మధ్యాహ్న భోజనం సదుపాయం, ఉచిత పుస్తకాల పంపిణీతో పాటు సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు సరఫరా చేస్తోంది. ఒకటి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు సరఫరా చేస్తున్నారు. ఈ దుస్తుల పంపిణీలో ప్రతి ఏటా ఆలస్యం అవుతుందని భావించిన రాష్ట్ర రాజీవ్ విద్యామిషన్ అధికారులు.. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే మేల్కొన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందుగా నిర్వహించే బడిబాట కార్యక్రమంలోనే కొత్త దుస్తులు సరఫరా చేయాలని భావించిరు. ఇందుకోసం జిల్లాలో 1, 99, 915 మంది విద్యార్థులను గుర్తించి వారికి జతకు రూ.160 చొప్పున రెండు జతలకు రూ. 6.38 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో తొలి విడతగా రూ. 3.19 కోట్లు ఎస్‌ఎంసీల ద్వారా ఆప్కోకు పంపిం చారు. దీంతో గత నెలలో జిల్లా విద్యార్థులకు రెండు జతలకు కావాల్సిన వస్త్రాన్ని సరఫరా చేశారు. దాన్ని జిల్లా కేంద్రం నుండి ఎంఆర్సీలకు పంపిణీ చేశారు. ఈ వస్త్రాన్ని ఎస్‌ఎంసీల ద్వారా గ్రామాల్లోని దర్జీలకు అప్పగించి సకాలంలో కుట్టించి విద్యార్థులకు అందజేయాలి. కమీషన్లకు పలువురు అధికారుల కక్కుర్తి... యూనిఫాం క్లాత్ వచ్చిందని తెలుసుకున్న జిల్లాలోని పలు స్టిచ్చింగ్ సెంటర్లతో పాటు, ఇతర జిల్లాల్లోని పలువురు దర్జీలు జిల్లా అధికారులను సంప్రదించారు. దుస్తులు కుట్టేందుకు తమకు అవకాశం కల్పించాలని ఆర్జీలు పెట్టుకున్నారు. తమకు కుట్టే అవకాశం ఇస్తే కమీషన్ కూడా ఇస్తామని కొందరు అధికారులకు ఆశపెట్టినట్లు తెలిసింది. దీంతో కమీషన్లకు కక్కుర్తి పడిన పలువురు అధికారులు తాము పంపించిన ఏజెన్సీలకే అవకాశం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను, ఎంఈవోలను ఆదేశించినట్లు తెలిసింది. ఇందుకు పలువురు అధికారులు ససేమిరా అనడంతో ‘ఇది జిల్లాలోని ఓ ఉన్నతాధికారి ఆదేశమని.. పాటించకపోతే మీ ఇష్టం’ అని బెదిరించినట్లు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితిలో జిల్లా అధికారులు ఇవ్వమన్న ఏజెన్సీలకు ఇచ్చేందుకు హెచ్ఎంలు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు దర్జీలు ఎంఈవోల వద్దకు వెళ్లి తమకే ఇవ్వాలని మొరపెట్టుకున్నా.. తమ పరిధిలో ఏమీలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కెటాయిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయంపై గిరిజన ప్రాంతాల్లో ఉన్న తమకే యూనిఫాం కుట్టే అవకాశం ఇవ్వాలని ఇటీవల భద్రాచలంలో జరిగిన అధికారుల సమావేశంలో పలువురు మహిళలు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. తమకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు చెందిన ఏజెన్సీలకు ఏలా ఇస్తారని వారు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పీవో జిల్లా ఆర్వీఎం అధికారులను మందలించినట్లు తెలిసింది. జిల్లా దర్జీలకే అవకాశం కల్పించాలి... రెడీమెడ్ దుస్తుల రాకతో జిల్లాలోని దర్జీలు పనులు లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించి ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా వచ్చే దుస్తులను జిల్లాలోని దర్జీలకే అవకాశం కల్పించాలని టైలర్స్ యూనియర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు జానీ అధికారులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరఫరా చేసే దుస్తులు ఇతర జిల్లాలకు చెందిన టైలర్లకు ఇవ్వాలనే ఆలోన విరమించుకోవాలని తెలంగాణ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు నహీమున్నీసా భేగం, కార్యదర్శి ఎండీ గౌస్ద్దీన్ డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల దర్జీలకు అవకాశం కల్పిస్తే ఆందోళన చేస్తామని, ఆర్వీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.