కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు అంతంతే
రావాల్సింది 11 వేల కోట్లు.. వచ్చింది 3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణలో వివిధ శాఖలకు రావాల్సిన నిధులు రావడం లేదు. ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుంది. అయినా ప్రణాళిక పద్దు కింద రావాల్సిన దాదాపు రూ.11 వేల కోట్లు ఇప్పటికీ రాలేదు. దీంతో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు కేంద్రాన్ని సంప్రదిస్తూ నిధులు విడుదల కోసం ప్రయత్నించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు స్పష్టం చేయనుంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్రం నుంచి ప్రణాళిక పద్దు కింద రూ.11 వేల కోట్ల మేర నిధులు వస్తాయని ఆశించారు. అయితే గడిచిన ఏడు నెలల్లో రూ.3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
ఎఫ్ఆర్బీఎంపై అదే అస్పష్టత..
ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం)కు సంబంధించి నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. అయితే కేంద్రం నుంచి ఆ సూచనలేవీ ఇప్పటి వరకు అందలేదు. ఆ సడలింపులు వస్తే తప్ప.. అదనంగా రుణం తెచ్చుకోవడానికి వీలుకాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.