యూలిప్స్ మెరవాలంటే..
ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలానికి ఈక్విటీలే అధిక రాబడినిస్తాయన్నది పదేపదే రుజువవుతున్న వాస్తవం. కానీ స్టాక్ మార్కెట్లలో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకుల దృష్ట్యా వీటిలో పెట్టుబడిపై రిస్క్ ఉంటుంది. ఎవరెంత రిస్క్‌ను భరించగలరో అంతమేరకు వారు పెట్టుబడి పెడుతుంటారు. కానీ ఇలాంటి ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో కూడా ఇటు బీమా రక్షణతో పాటు పెట్టుబడిపై అధిక లాభాలను పొందడానికి యూనిట్ ఆధారిత బీమా పథకాలు (యూలిప్స్) అవకాశమిస్తున్నాయి. యూలి ప్స్‌లో వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలామంది తమకు అనువయ్యేవి ఎంపిక చేసుకోవటం లేదని తెలుస్తోంది. అసలు ఎలాంటి ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి? ఎవరికి ఏవి అనువుగా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం...
గ్రోత్/అగ్రసివ్ ఫండ్: ఈ ఫండ్స్ అత్యధిక మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. అంటే మిగిలిన ఫండ్స్‌తో పోలిస్తే వీటిలో రిస్క్ కాస్త ఎక్కువ. అలాగే రాబడీ ఎక్కువే. దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి.
బ్యాలెన్స్డ్ ఫండ్: పేరుకు తగ్గట్టే ఈ ఫండ్ చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తుంది. సగం మొత్తాన్ని ఈక్విటీలకు మిగిలిన మొత్తాన్ని డెట్ పథకాలకు కేటాయించడం జరుగుతుంది. ఇవి స్థిరాదాయాన్నిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి, గ్రోత్ ఫండ్స్‌తో పోలిస్తే రాబడి కాస్త తక్కువగానే ఉంటుంది. మధ్యస్థాయి రిస్క్ తీసుకునే వారికి వీటిని సూచించొచ్చు.
కన్జర్వేటివ్ ఫండ్స్: ఈ ఫండ్స్ అత్యధిక మొత్తాన్ని రిస్క్ తక్కువగా ఉండే డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే పై రెండు పథకాలతో పోలిస్తే దీంట్లో నష్ట భయం మరింత తక్కువ. అస్సలు నష్ట భయానికి సిద్ధపడని వారికి ఇది బాగుంటుంది.
ఫండ్ ఎంపికలో చూడాల్సినవి
ఫండ్ ఎంపికలో ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి అనేది చాలా ముఖ్యం. మీ ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి ఐదు నుంచి 10 ఏళ్లు అయితే రిస్క్ చాలా తక్కువగా ఉండే కన్జర్వేటివ్ ఫండ్స్‌ని, అదే 10 నుంచి 15 ఏళ్లయితే బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఇంతకంటే దీర్ఘకాలం అయితే అగ్రసివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.
ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితే కాకుండా, మీ రిస్క్ సామర్థ్యం, వయస్సు తదితర అంశాలు కూడా ఫండ్ ఎంపికపై ప్రభావం చూపుతాయి. 30-50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 60-70% గ్రోత్ ఫండ్స్‌కు, ఆపైన వయస్సు ఉన్న వారు 50-60% కన్జర్వేటివ్ ఫండ్స్‌కు కేటాయించండి. అలాగే యూలిప్స్‌లో ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసే విధంగా ఎంచుకోవడం మంచింది.
డైనమిక్ ఫండ్
ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత కూడా ఏ ఫండ్ ఎంపిక చేసుకోవాలో అర్థం కాని వారి కోసం బీమా కంపెనీలు డైనమిక్ ఫండ్ పేరుతో ఇంకో అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీన్ని ఎంపిక చేసుకుంటే మీ ఆదాయం, పాలసీ కాలపరిమితి వంటి అంశాల అధారంగా మీ పోర్ట్‌ఫోలియోలో ఫండ్ కేటాయింపులను కంపెనీయే చేస్తుంది.
- వి.విశ్వనాధ్, డెరైక్టర్, మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్