సమైక్య సంకల్పం
సమైక్య నాదం ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్ర విభజనోద్యమ సెగలు ఎగసిపడుతున్నాయి. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. రాస్తారోకోలు, మానవహారాలు, బంద్‌లు, నిరశన దీక్షలు వరుసగా ఎనిమిదో రోజూ కొనసాగాయి. సమైక్యాంధ్ర సాధన కోసం బుధవారం నుంచి వైఎస్సార్సీపీ ఆమరణ నిరశన దీక్షలు చేపట్టింది.
మునగపాక, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తన కుమారుడు ప్రధాని కావాలన్న దుర్బుద్ధితో సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పూనుకుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు. వైఎస్సార్ సీపీ రాంబిల్లి మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (చంటిరాజు) మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించడం విచారకరమన్నారు.
ఈ సందర్భంగా మునగపాక మెయిన్‌రోడ్డులో కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి సమైకాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఈసీఎస్ డెరైక్టర్ దొడ్డి బాలాజీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సూరిశెట్టి సుధారాణి, మునగపాక సర్పంచ్ టెక్కలి రమణబాబు, తోటాడ సర్పంచ్ దాడి వీరమహలక్ష్మినాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, పార్టీ నేత షేక్ ఇస్మాయిల్, విశ్రాంత తహశీల్దార్ కాండ్రేగుల సూర్యనారాయణ, ఉప సర్పంచ్ ఆడారి పోలి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.