నేటి నుంచి వరంగల్ నిట్లో టెక్నోజియాన్-14
హన్మకొండ: దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద సాంకేతిక ఉత్సవమైన టెక్నోజియాన్కు వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 500 కళాశాలల నుంచి ఏడువేల మంది విద్యార్థులు ఈ టెక్నోజియాన్లో పాల్గొననున్నారు. వీరిలో నిట్ వరంగల్ విద్యార్థులు 3,500 మంది ఉన్నారు. ‘ప్రాచీన ఇంజనీరింగ్ పద్ధతులు’ ప్రధాన అంశంగా వరంగల్ నిట్లో తొమ్మిదో టెక్నోజియాన్ జరుగనుంది. ఇప్పటికే నిట్ టెక్నోజియాన్ -2014కు యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గైనె జేషన్ (యునెస్కో) గుర్తింపు లభించింది. కాగా, నిట్లో టెక్నోజియాన్ 2006లో ప్రారంభమైంది. ఇది తొమ్మిదో టెక్నోజియాన్గా రికార్డు కానుంది.
నేటి నుంచి ప్రారంభం
టెక్నోజియాన్ను 16న సాయంత్రం 6గంటలకు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ నిట్ ఆడిటోయంలో లాంఛనం గా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో నిట్ క్యాంపస్లో ప్రధాన కార్యక్రమాలు ఉంటాయి. నిట్ టెక్నోజియాన్లో నేషనల్ రోబోటిక్స్ చాంపియన్ షిప్, నేషనల్ ప్రోగ్రామింగ్ అంశాలపై విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శిస్తారు. వీటితో పాటు 12 వర్కషాప్లు, 7 ఇనిషియేటివ్ కార్యక్రమాలు, మరో 50 రకాల ఈవెంట్లు ప్రదర్శిస్తారు. వేడుకల్లో ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం మాజీ డైరక్టర్ రాజేంద్ర షిండే, అగ్ని మిస్సైల్ ప్రోగ్రాం డెరైక్టర్ వీజీ శేఖరన్, టెక్ వేదిక సీఈవో సాయి సంగినేని పాల్గొననున్నారు.
స్వచ్ఛ భారత్కు పెద్దపీట
ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి టెక్నోజియాన్లో ప్రాధాన్యం ఇచ్చారు. సామాజిక అంశంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితోపాటు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేసే ఆకాంక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అదే విధంగా వేస్ట్ మేనేజ్మెంట్, గ్రీన్ గణేషా, క్లైమెట్ లీడర్షిప్, టెక్నోజియాన్ ఇంపాక్ట్, డిజైన్ మాఫియా, భారత్లో మహిళలు వంటి అంశాలపై ప్రోత్సాహకర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.