కాస్ట్లీ ప్లేస్... ఖాన్ మార్కెట్
ముంబై: భారత్లో షాపుల అద్దె అత్యధికంగా ఉన్న ప్రాంతంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ జాబితాకెక్కింది. ఇక అంతర్జాతీయంగా దీని ర్యాంకింగ్ రెండు స్థానాలు మెరుగుపడి 24కు చేరింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకారం.. అద్దెలో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆయా దేశాల ర్యాంకులలో స్వల్ప మార్పుల కారణంగా ఖాన్ మార్కెట్ ర్యాంక్ రెండు స్థానాలు మెరుగుపడింది.
ఖాన్ మార్కెట్లో అద్దె సంవత్సరానికి ఒక చదరపు అడుగుకు 235 డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అద్దె ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో న్యూయార్క్ (అప్పర్ 5వ అవెన్యూ) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ (క్యూసీవే బే), పారిస్ (అవెన్యూ డి చాంప్స్ ఎల్లీసెస్) నిలిచాయి. ఖాన్ మార్కెట్ తర్వాత భారత్లో అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా న్యూఢిల్లీ-ఎన్సీఆర్లోని కన్నాట్ ప్లేస్ రెండో స్థానంలో, గుర్గావ్లోని డీఎల్ఎఫ్ గాలెరియో 3వ స్థానంలో, న్యూఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ 4వ స్థానంలో ఉన్నాయి.