ఉరవకొండ తహసీల్దార్‌పై బదిలీ వేటు
- కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య నేపథ్యంలో ఉన్నతాధికారుల చర్య
- నూతన తహసీల్దార్‌గా తిమ్మప్ప బాధ్యతల స్వీకరణ
ఉరవకొండ : ఉరవకొండలో ‘పచ్చ బ్యాచ్’ దందాల నేపథ్యంలో తహసీల్దార్ బ్రహ్మయ్యపై బదిలీ వేటు పడింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సోమందేపల్లి తహసీల్దార్ తిమ్మప్ప నాయుడును ఉరవకొండ తహసీల్దార్‌గా నియమించారు. ఆయన మంగళవారం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఉరవకొండ మండలానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ గోవిందుతో పాటు మరికొందరు ఆ పార్టీ నాయకులు బ్యాచ్‌గా ఏర్పడి.. అధికారులు, సిబ్బందిని బెదిరించి ప్రభుత్వ, దేవాదాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రామలింగం ఆత్మహత్య నేపథ్యంలో ‘పచ్చ బ్యాచ్’ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఈ నెల 12న ‘సాక్షి’ దినపత్రికలో ‘రెచ్చిపోతున్న పచ్చబ్యాచ్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. కలెక్టర్ కోన శశిధర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. అనంతపురం ఆర్డీఓ మలోలా, ఇతర అధికారులతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ నేపథ్యంలోనే తహసీల్దార్ బ్రహ్మయ్యపై బదిలీ వేటు పడింది.
‘పచ్చ బ్యాచ్’పై చర్యలు లేవా?
ఉరవకొండలో పలు ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ మృతికి కారణమైన ‘పచ్చ బ్యాచ్’పై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సాహసించడం లేదు. తమ పార్టీకి చెందిన వారు అక్రమాలకు పాల్పడింది వాస్తవమేనని కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలే చెబుతుండటం గమనార్హం. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పోలీసులు సైతం రామలింగం ఆత్మహత్య కేసులో తూతూమంత్రంగా విచారణ చేసి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.