ఆ రోజు ఆ రోడ్డులో వెళ్లకపోయి ఉంటే...
‘‘ఓ రోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే, ఒకాయన కారులో వెళుతున్నారు. నన్ను చూడగానే ఆయన కారాపి ‘రేపు ఒకసారి ఆఫీసుకి రాగలవా’ అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. కాసేపు నా నోట మాట రాలేదు. ఎందుకంటే, ఆ పిలిచిన వ్యక్తి ఎవరో కాదు.. గ్రేట్ డెరైక్టర్ కె. బాలచందర్. ఆ తర్వాత రోజు నేను ఆఫీసుకు వెళ్లడం. నా కెరీర్ మలుపు తిరగడం.. ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే’’ అని కమల్‌హాసన్ ఉద్వేగంగా చెప్పారు.
కామెడీ హీరో సంతానం కథానాయకునిగా నటించిన ‘వాలిబ రాజా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో కమల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఇంకా కమల్ మాట్లాడుతూ - ‘‘యువతరాన్ని ప్రోత్సహించాలని నా గురువు కె. బాలచందర్ చెబుతుంటారు. ఆయన ప్రోత్సహించారు కాబట్టే, నేనీ రోజు మంచి స్థాయిలో ఉన్నాను. ఇక.. నన్ను రోడ్డు మీద చూసి, ఆయన ఎందుకు రమ్మన్నారంటే... ‘అపూర్వ రాగంగళ్’ సినిమా కోసం తమిళ నటుడు శ్రీకాంత్‌ని హీరోగా అడిగితే, ఆయన బిజీగా ఉన్నారట.
శ్రీకాంత్ బిజీగా ఉన్నంత మాత్రన రోడ్డు మీద వెళ్లేవాళ్లని నటించపజేస్తామా.. ఏంటి? అని బాలచందర్‌గారు అంటున్న సమయంలో నేను కనిపించానట. నేను కరెక్ట్‌గా ఉంటాననిపించి, నన్ను ఎంపిక చేశారు. ఆ రోజు నేనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లకపోయి ఉంటే, ఈరోజు ఎక్కడ ఉండేవాణ్ణో తెలియడంలేదు. నేను లాయర్ కావాలనుకునేవాణ్ణి. ఒకవేళ సినిమాల్లో అవకాశం రాకపోతే, ఈపాటికి ఏదైనా కేసులు వాదించుకుంటూ ఉండేవాణ్ణేమో’’ అన్నారు నవ్వుతూ.