వైరా ‘నాయక్’ఎవరో..?
వైరా, న్యూస్‌లైన్: అసెంబ్లీ : వైరా
రిజర్వేషన్: ఎస్టీ జనరల్
నియోజకవర్గం ప్రత్యేకతలు....
ఓటర్లలో 45 శాతం గిరిజనులు.వ్యవసాయానికి అనువైన ప్రాంతం. వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 25 వేల ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్ నుంచి 80 గ్రామాలకు తాగునీరు సౌకర్యం.
తెలంగాణ శబరిమలైగా పేరుగాంచిన వైరా హరిహరసుత అయ్యప్పక్షేత్రం, ఏన్కూరు మండలంలోని నాచారం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. వైరా నియోజకవర్గానికి ఇది రెండో ఎన్నిక. మొదటిసారి టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థినిగా బా ణోత్ చంద్రావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
వైరా నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. సీపీఎం మద్దతుతో వైఎస్ఆర్సీపీ దూసుకెళ్తోంది. ఆ పార్టీ నుంచి బాణోత్ మదన్‌లాల్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా మూడు నారాయణ, బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా బాణోత్ బాలాజీ పోటీలో ఉన్నారు. క్రితంసారి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా గెలిచిన బాణోత్ చంద్రావతికి ఈసారి ఆ పార్టీ టిక్కెట్ నిరాకరించింది. ఆమె టీఆర్ఎస్ అభ్యర్థినిగా ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. వీరుకాక మరో ఆరుగురు అభ్యర్థులు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు. పునర్విభజనకు ముందు నాలుగు నియోజకవర్గాల్లో ఈ సెగ్మెంట్ పరిధిలోని మండలాలున్నాయి. ఆ తర్వాత వైరా, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు మండలాలతో నియోజకవర్గం ఆవిర్భవించింది. నియోజకవర్గంలో గెలుపోటములను శాసించేది గిరిజనులే.
చంద్రావతి, మదన్‌లాల్ మినహా అందరూ కొత్తవారే...
2009 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఎన్నికల్లో బాణోత్ చంద్రావతి గెలపొందారు. ఆ ఎన్నికల్లో నేడు వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తున్న బాణోత్ మదన్‌లాల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీచేశారు. వీరిద్దరు మినహా మిగిలిన వారందరూ కొత్తవారే. సీపీఐ నుంచి పోటీలో ఉన్న డాక్టర్ మూడు నారాయణ జూలూరుపాడు మండలంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, టీఆర్ఎస్లతో జతకట్టి లబ్ధిపొందిన సీపీఐ తరఫున ఈయన పోటీచేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్‌తో జతకట్టినా ఎంతమేరకు ప్రయోజనం జరుగుతుందనేది ప్రశ్నార్థకమే. బీజేపీ మద్దతో టీడీపీ అభ్యర్థిగా బాణోత్ బాలాజీనాయక్ బరిలో దిగినా బీజేపీ ప్రాబల్యం నియోజకవర్గంలో లేదనే చెప్పాలి. కొణిజర్ల మండలం మినహా మిగిలిన ప్రాంతాల్లో అభ్యర్థి అంతగా తెలియకపోవడం కూడా ఆ పార్టీకి గట్టిదెబ్బేనని అంటున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రాబల్యం అంతగా లేనందున సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రావతి గెలుపు సాధ్యంకాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
నియోజకవర్గంలో గడపగడపకు తెలిసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ ఈ ఎన్నికల్లో సీపీఎం అండతో దూసుకుపోతున్నారు. గిరిజనుల అండ, వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే తనను గెలిపించి తీరుతాయని ఆయన విశ్వసిస్తున్నారు.