Vajedu zone
-
మూడు వాగులు.. మూడు గుట్టలు దాటినా..
వాజేడు: ఆ ఊరు మూడు వాగులు.. మూడు గుట్టల వెనుక ఉంది. దారి లేదు.. వాహన సౌకర్యం అసలే లేదు. అలాంటి ఊరి నుంచి జ్వరంతో బాధపడుతున్న కొడుకును ఆస్పత్రిలో చూపిద్దామని భుజాలపై మోసుకుంటూ వచ్చారు తల్లిదండ్రులు. తీరా ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిద్దామనుకునేలోపే ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, కాంతమ్మలకు ముగ్గురు పిల్లలు. వారు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ గ్రామం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టల మీద ఉంటుంది. ఆదివారం రాకేశ్(4)కు జ్వరం ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు భుజాల మీద మోసుకుంటూ మూడు వాగులు దాటుకుని.. మూడు గుట్టలు దిగి వచ్చి పగళ్లపల్లిలో ఉన్న చుట్టాల ఇంటికి చేరుకున్నారు. అదే గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించారు. అయినా తగ్గలేదు. సోమవారం మళ్లీ వైద్యానికి వెళ్లగా పరిస్థితి బాగా లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించాడు. దీంతో శేషయ్య దంపతులు రాకేశ్‌తోపాటు జ్వరంతో ఆస్పత్రికి వచ్చారు. వైద్యులకోసం వేచి ఉండగా.. అప్పటికే ఆలస్యం కావడంతో రాకేశ్ మృతి చెందాడు. బంధువుల ఇంటిలో.. రాకేశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే 15 కిలోమీటర్లు వాగులు, గుట్టలు దాటుకుని నడకదారిన వెళ్లాలి. అప్పటికే సాయంత్రం అయ్యింది. దాంతో ఊరు వెళ్లే అవకాశం లేక పోవడంతో శేషయ్య దంపతులు కొడుకు మృత దేహంతో ప్రగళ్లపల్లిలోని బంధువుల ఇంట్లోనే తలదాచుకున్నారు. సకాలంలో వైద్యం అందితే కొడుకు బతికే వాడని తల్లి కాంతమ్మ వాపోయింది. ఈ విషయంపై వైద్యాధికారి యమునను ‘సాక్షి’వివరణ కోరగా వారు ఆర్ఎంపీ వద్ద ఆదివారం వైద్యం చేయించుకున్నారని, సోమవారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందినట్లు తెలిసిందని చెప్పారు. వారు తమ ఆస్పత్రికి రాలేదని తెలిపారు. -
ఆగని పోడు పోరు
వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండలం ఎర్రబోరు ప్రాంతంలో పోడు పోరు బుధవారమూ కొనసాగింది. ఈ భూమి విషయంలో కృష్ణాపురం గిరిజనులు, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం ఘర్షణకు దిగడతంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది.గిరిజనులు ఈ భూమిని దున్నిన విషయం తెలుసుకొని పాల్వంచ, భద్రాచలం, వెంకటాపురం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారులతో కలిసి పోలీస్‌శాఖ సమక్షంలో బుధవారం ఉదయం మొక్కలు నాటారు. ఆ మొక్కలను తొలగించేందుకు గిరిజనులు భారీ సంఖ్యలో వచ్చారు. వారిని పోలీసు, అటవీశాఖ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. గిరిజన మహిళలు ముందుకు రావడంతో కొంత వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో పోలీసులను దాటుకుంటూ గిరిజనులు పోడుభూమిలోకి చొచ్చుకువచ్చి అటవీశాఖ సిబ్బంది వేసిన మొక్కలను పీకివేశారు. ఓవైపున అధికారులు, గిరిజనులు వాదులాడుకుంటుంటే మరోవైపున మరికొంత మంది గిరిజనులు నాగళ్లతో పోడుభూమిని దున్ని విత్తనాలు చల్లారు. కొందరు గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకొని జీపులోకి ఎక్కించగా, గిరిజన మహిళలు అడ్డుకున్నారు. కాగా, ఒకరిద్దరిపై కేసులు పెడితే ఊరుకునేది లేదని..కేసులు పెట్టాల్సి వస్తే అందరిపై పెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. తహశీల్దార్ వీరప్రకాశ్ వచ్చి అధికారులు, గిరిజనులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గిరిజనులు, అటవీశాఖ సిబ్బంది భూమిలోకి రావద్దని ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయూయి.