భక్తుల కొంగు బంగారం ఇంద్ర వరదుడు
యాదమరి(చిత్తూరు జిల్లా): మండల కేంద్రమైన యాదమరిలోని త్రివేణి సంగమంలో పడమరవైపు ముఖద్వారంతో వెలసిన ఇంద్రవరదరాజ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం అంకురార్పణ నిర్వహించనున్నారు. మేరకు ఆలయ కమిటీ సభ్యులు చలువ పందిళ్లతోపాటు భక్తులకు సౌకర్యాల కల్పన, స్వామివారి వాహన సేవలకు సర్వం సిద్ధం చేస్తోంది. మంగళవారం అంకురార్పణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం మూలస్థానంలో వున్న శ్రీదేవి, భూదేవి, సమేత వరదరాజలు స్వామికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, అర్చన నిర్వహించి పూజలు చేసి విష్వక్సేన ఉత్సవం, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో బ్రహ్మోత్సవాలను భారీగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
యాదపొద నుంచి యాదమరిగా పేరు మార్పు
త్రివేణి సంగమంలో యాదపొద ఉన్న చోట ఇంద్రుడు స్వామి ఆలయాన్ని ప్రతిష్టించడంతో ఆ గ్రామానికి ఇంద్రపురి అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ పేరు క్రమేపీ యాదమరిగా మారింది. ఈ ఆలయాన్ని 2వ శతాబ్దంలో పల్లవరాజులు రాజగోపురం నిర్మించి నిత్య పూజలు నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయులు ఆలయానికి ప్రహరీ గోడ, వాహన మండపం నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
మూడు రాష్ట్రాల నుంచి భక్తులు
ఇంద్రవరుదుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆంధ్రతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం, పుష్పపల్లకి ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
ఏడాదికి వెయ్యి పెళ్లిళ్ల నిర్వహణ
ఇంద్రవరదుని ఆలయంలో సంవత్సరంలో వెయ్యి పెళ్లిళ్లకు పైగానే జరుగుతాయి. యాదమరి మండలం తమిళనాడు సరిహద్దులో ఉంది. తమిళనాడు వాసులు కూడా ఇక్కడకు వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే మొదటి సంతానం మగ బిడ్డ పుడతారని భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాల వివరాలు
జూన్ 1వ తేదీ : ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం
జాన్ 02వ తేదీ : ఉదయం సప్రంలో ఉత్సవం, రాత్రి హంస వాహనం
జాన్ 03న : ఉదయం సప్రంలో ఉత్సవం, రాత్రి యాళివాహనం
జాన్ 04న: ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి శేషవాహనం
జూన్ 05న: ఉదయం గరుడ వాహనం, రాత్రి కల్పవక్ష వాహనం
జూన్ 06న: ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గజ వాహనం
జూన్ 07న: ఉదయం రథోత్సవం, రాత్రి తోటోత్సవం
జూన్ 08న: వెణ్ణత్తాయ్ కణ్ణన్, తిరుక్కోలం, రాత్రి అశ్వవాహనం
జూన్ 09న: గురువారం సాయంత్రం తీర్థవారి, పుణ్యకోటి విమానం, రాత్రి ధ్వజావరోహనం
జాన్ 10వ తేదీ: రాత్రి పుష్పపల్లకి సేవ
జూన్ 11న : వడాయిత్సోవంతో బ్రహ్మోత్సవాల ముగింపు